Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్ తమిళిసై
నవతెలంగామ బ్యూరో - హైదరాబాద్
ప్రపంచం ఎదుట మన దేశ వైవిధ్యతను ప్రదర్శించేందుకు జీ-20 ప్రెసిడెన్సీ మంచి అవకాశమని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ తెలిపారు. మంగళవారం రాజ్ భవన్లో నిర్వహించిన ఇండియాస్ జీ20 ప్రెసిడెన్సీ రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలకు ఆమె అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశాన్ని లోతుగా అర్థం చేసుకునేలా పోటీల్లో పాల్గొన్న భాగస్వాములు ఆసక్తి చూపించారని అభినందించారు. జీ20 అంశం వసుదైక కుటుంబం, ఈ విషయంలో భారతదేశానికి పురాతన కాలం నుంచి అనుభవముందని తెలిపారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తంటూ ఆమె గుర్తుచేశారు. స్వాతంత్య్ర సమరయోధులు కలలుగన్న ప్రపంచ అగ్రగామి నాయకత్వంలోకి భారత్ ప్రవేశిస్తున్నదని చెప్పారు. లక్ష్యాలను చేరుకోవడంలో ఎదురయ్యే చిన్న, చిన్న అడ్డంకులకు భయపడొద్దంటూ ఆమె విద్యార్థులకు సూచించారు. వారిలో ఆత్మవిశ్వాసం పెరిగేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమదైన ప్రత్యేక ప్రతిభతో జన్మిస్తారనీ, వారిలోని ప్రతిభను ఎవరికి వారు గుర్తించేలా ప్రోత్సహించడం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల బాధ్యత అని ఆమె గుర్తుచేశారు. అనంతరం ఆమె వ్యక్తృత్వం, వ్యాసరచన, పోస్టర్ పోటీల్లో విజేతలకు పురస్కారాలను, బహుమానాలను అందజేశారు. రాష్ట్రంలోని ఆయా యూనివర్సిటీల నుంచి దాదాపు 500 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొనగా, ఉస్మానియా యూనివర్సిటీ బోధనా సిబ్బంది న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో రాజ్ భవన్ సీనియర్ ఉన్నతాధికారులు, యూనివర్సిటీల బోధనా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.