Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత సాధించడం కోసం నేడు బెంగుళూరులో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం నియమించబడ్డ జస్టిస్ సదాశివన్ కమిటీ నివేదికను ఆమోదించడంలోనూ, అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి నివేదించడంలో కర్నాటకలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యానికి పాల్పడుతున్నదని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన జస్టీస్ ఉషా మెహ్రా కమిషన్ నివేదికను ఆమోదించడంలో, పార్లమెంట్ ద్వారా ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ చేస్తామని దశాబ్దకాలంగా మాదిగలను నమ్మిస్తూ బీజేపీ మోసంచేస్తున్నదని తెలిపారు. మాదిగల పట్ల మోసపూరితంగా వ్యవహరిస్తున్న కేంద్రం, కర్నాటక ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావడమే ప్రధాన కర్తవ్యంగా మాదిగ ఉపకులాలు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే నేడు బెంగుళూరులో ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల జాతీయ సదస్సు వసంత్ నగర్ లో గల అంబేడ్కర్ భవన్లో జరుగుతున్నదని తెలిపారు.