Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కోవిడ్-19 తర్వాత జీవశాస్త్ర రంగంలో వచ్చిన కొత్త అంశాలు, సవాళ్లు, అవకాశాలపై బయో ఆసియా - 2023లో చర్చించనున్నారు. ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు హైదరాబాద్లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న వేదికలో ప్రపంచ నాయకులు, శాస్త్రవేత్తలు, జీవశాస్త్ర రంగానికి సంబంధించిన చట్టబద్ధ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామిక సంఘాలు, విద్యావేత్తలు తదితరులు పాలుపంచుకోనున్నారు. కరోనా మహమ్మారి ప్రజలకు అందుబాటులో ఆరోగ్య సేవలను అందించేందుకు బయో సైన్సెస్ రంగంతో ముడిపడిన భాగస్వాములంతా సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. 20వ బయోఆసియా సదస్సును రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్నది. ఆరోగ్యసేవలు మానవీయతతో అందరికీ అందించడమెలా? అనే దానిపై భాగస్వాములు వివిధ అంశాల వారీగా చర్చించనున్నారు. ఈ సదస్సుకు ఎర్న్స్ట్ అండ్ యంగ్ (ఇవై) నాలెడ్జ్ పాట్నర్గా వ్యవహరించనున్నది.
ఈ సదస్సులో ప్రజారోగ్య పరిరక్షణలో 20 కొత్త ఔషధాలు, సెల్, జీన్ థెరపీలను అభివృద్ధి చేసిన నోవార్టీస్ సీఇఓ డాక్టర్ వసంత్, మోడర్నా సహ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ రాబర్ట్ లంగర్, కోయలేషన్ ఫర్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్స్ సీఇఓ డాక్టర్ రిచర్డ్ హాట్ చెట్, రీసైలెన్స్ డాక్టర్ రాహుల్ సింఘ్వీ, యూఎస్-ఎఫ్ డీఏ గ్లోబల్ పాలసీ, స్ట్రాటజీ అసోసియేట్ కమిషనర్ డాక్టర్ మార్క్ అబ్డో, మైక్రోసాఫ్ట్ కార్పొరేట్ ప్లానింగ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ గ్రెగరీ మూర్, చికాగో ఇలినాయిస్ యూనివర్సిటీ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ప్రొఫెసర్ సర్ఫరాజ్ కె.నియాజీ తదితరులు వివిధ దేశాల నుంచి పాల్గొననున్నారు. మన దేశం నుంచి అపొలొ హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతా రెడ్డి, డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ చైర్మెన్ సతీష్ రెడ్డి, వెల్లూర్ సీఎంసీ గ్యాస్ట్రోఇంటెస్టినల్ విభాగం ప్రొఫెసర్, వైరాలజిస్ట్ డాక్టర్ గంగదీప్ కంగ్ తదితరులు పాల్గొననున్నారు. హైదరాబాద్ మరోసారి బయో ఆసియా సదస్సుకు వేదిక కానుండటం పట్ల రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సదస్సు చెప్పే తెలివైన పరిష్కారాలను ప్రపంచం వింటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.