Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏప్రిల్ వరకు 4 లక్షల టన్నులు
- వచ్చే ఏడాదిలో 80 లక్షల టన్నుల బొగ్గు సరఫరా
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించిన తెలంగాణ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఫేజ్-1 ప్లాంట్లకు బొగ్గు సరఫరా కోసం ఆ సంస్థ సింగరేణితో ఒప్పందం చేసుకుంది. మంగళవారం సింగరేణి సంస్థ ఈడీ(కోల్ మూమెంట్) జె అల్విన్, ఎన్టీపీసీ తెలంగాణ ప్రాంత పర్యవేక్షక ఉన్నతాధికారి పాల్ సమక్షంలో జనరల్ మేనేజర్ (మార్కెటింగ్) కె సూర్యనారాయణ, ఎన్టీపీసీ జీఎం(ఫ్యూయెల్) తపస్ సాహౌలు ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. దీని ప్రకారం ఫేస్ -1 లోని 800 మెగావాట్ల ప్లాంట్‌కు సింగరేణి ఈ ఏడాది ఏప్రిల్ వరకు 4 లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేయనున్నదని జీఎం(మార్కెటింగ్) కె.సూర్యనారాయణ తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఫేస్ -1 లోని రెండు ప్లాంట్లకు 80 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేయడానికి ఒప్పందం కుదిరిందన్నారు. సింగరేణి రామగుండంలో ఇప్పటికే అక్కడి ఎన్టీపీసీకి చెందిన 2,600 మెగావాట్ల ప్లాంట్‌కు ఏడాదికి 112 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేస్తున్నదని తెలిపారు. తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా 8 రాష్ట్రాల్లోని 13 ఎన్టీపీసీ ప్లాంట్లకు ఏటా 139 లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేస్తున్నట్టు వివరించారు. సమావేశంలో సింగరేణి డీజీఎం (మార్కెటింగ్) తాడబోయిన శ్రీనివాస్, ఎస్వోఎం సురేందర్‌రాజు, అడిషనల్ మేనేజర్ మహేందర్ రెడ్డి, ఎస్ఈ రవి శ్రీవాస్తవ, ఎన్టీపీసీ ఏజీఎం ఆవిష్కర్ మెష్రమ్ పాల్గొన్నారు.