Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శికి టీఎస్ఆర్టీసీఈయూ విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఖమ్మంలో జరిగే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) బహిరంగ సభకు హాజరైతే తమ గోడును ఆ వేదికపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు వినిపించాలని టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఈయూ ప్రధాన కార్యదర్శి కే రాజిరెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం మగ్దూం భవన్లో కూనంనేనిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆర్టీసీలో యూనియన్ కార్యకలాపాలకు అనుమతించపోవడంతో కార్మికులు అనేక అవస్థలు పడుతున్నారని వారు ఈ సందర్భంగా తెలిపారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేదని గుర్తుచేశారు. ఆర్టీసీలో యూనియన్లను పునరుద్ధరించాలని కోరారు. అలాగే ఆర్టీసీ కార్మికులకు 2017, 2021 వేతన సవరణలు ఆమలు చేయాలని కోరారు. వేతన సవరణ చేయడానికి మునుగోడు ఉప ఎన్నికకు ముందు ఎన్నికల సంఘం నుంచి ఎలక్షన్ కోడ్ మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం అడిగిందనీ, ఎన్నికలు ముగిసి 60 రోజులు దాటినా ఇప్పటికీ పట్టించుకోలేదని చెప్పారు. వాటితో పాటు పలు పెండింగ్ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు కొవ్వూరు యాదయ్య, ఎమ్ఏ మజీద్, సుర్కంటి మోహాన్ రెడ్డి, కిషన్గౌడ తదితరులు పాల్గొన్నారు.