Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పండుగపూట ఇప్పటిదాకా పేదలకు రేషన్ బియ్యం ఎందుకు పంపిణీ చేయలేదో చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం ఈ మేరకు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు బహిరంగ లేఖ రాశారు. కరోనా కాలంలోనూ గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద కేంద్రం ఇచ్చిన బియ్యాన్ని కూడా పేదలకు అందకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకున్నదని విమర్శించారు. ఎఫ్‌సీఐ కోసం కొనుగోలు చేస్తున్న బియ్యాన్ని మొత్తం ఫోర్టిఫైడ్ రైస్‌గా ఇచ్చి విద్యార్థుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు కేంద్రం చేస్తున్న కృషిలో భాగస్వామ్యం కావాలని కోరారు. పదో తేదీ వచ్చినా ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు జీతాలివ్వకపోవడం, పెన్షనర్ల సొమ్మును ఖాతాల్లో జమచేయకపోవడం దారుణమని పేర్కొన్నారు. సంక్రాంతి పండుగకు పెండింగ్‌లోని నాలుగు డీఏలు చెల్లిస్తారని ఆశిస్తే కనీసం జీతాలు కూడా ఇవ్వకపోవడం అన్యాయమని తెలిపారు.
ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ తక్షణమే జీతాలతోపాటు పెన్షనర్లకు పెన్షన్ సొమ్మును విడుదల చేయాలని కోరారు.