Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓయూ పీహెచ్.డీ విద్యార్థుల ఫోరమ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కోవిడ్-19 సమయానికి మినహాయింపునిస్తూ పీహెచ్డీ పూర్తి చేసి ధీసిస్ సమర్పించేందుకు సమయాన్ని రెండేండ్లు పొడిగించాలని ఓయూ పీహెచ్.డీ విద్యార్థుల ఫోరమ్ డిమాండ్ చేసింది. మంగళవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఫోరం కన్వీనర్ సీహెచ్.మురళీ, కో కన్వీనర్ కనకారెడ్డి, సభ్యులు మల్లేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వన్‌టైమ్ పేరుతో పీహెచ్డీ అడ్మిషన్ లేని వారికి కూడా పట్టాలిచ్చి అవినీతికి పాల్పడిన ఓయూ వీసీపై విచారణ చేపట్టి విద్యావ్యవస్థను కాపాడాలని కోరారు. ఆయన చేసే అవినీతి, అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు. నాసిరకం, దొంగ పీహెచ్‌డీలపై యూజీసీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలన్నారు. దేశంలో ఏ యూనివర్సిటీలో లేని విధంగా ఓయూ 26 మంది సీనియర్ ప్రొఫెసర్లని యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు కల్పించారని ఆరోపించారు.
దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో ప్రీ-పీహెచ్డీ పూర్తయ్యాక డిపార్ట్ట్మెంట్ రీసెర్చ్ కమిటీ (డీఆర్సీ) అనుమతితో ఎన్ని సంవత్సరాల్లోనైనా పరిశోధన గ్రంథం (థిసీస్) సమర్పించుకోవడానికి వీలుందని తెలిపారు. కరోనా సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ దాదాపు రెండేండ్లు మూసేశారనీ, ఆ సమయంలో ల్యాబులు, లైబ్రరీలు సైతం మూతపడ్డాయని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో కోవిడ్ సమయాన్ని రెండేండ్లు పొడిగించాలంటూ యూజీసీ చెప్పినా వినకుండా ఆరు నెలల్లో పూర్తి చేయకపోతే పీహెచ్‌డీలు రద్దవుతాయంటూ ఆదేశాలిచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్కొక్క ప్రొఫెసర్ కింద 10 నుంచి 15 మంది స్కాలర్లని కేటాయించి అడ్డగోలుగా పీహెచ్‌డీలు పూర్తి చేయించారని విమర్శించారు. ఈ విధంగా దాదాపు 1,500 మంది పీహెచ్‌డీలు రద్దయినట్టు ప్రకటించారని తెలిపారు. సమావేశాలు, ధర్నాలు, ర్యాలీలపై నిషేధం విధించి నిజాం పాలకులను మించి విద్యార్థులపై అక్రమ కేసులను నమోదు చేయిస్తున్నారని విమర్శించారు.