Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కిం కర్తవ్యం..? సోమేశ్ భవితవ్యం...?
- అధికార, రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చలు
- తదుపరి సీఎస్‌గా రామకృష్ణారావు
- సీఎం పరిశీలనలో ఆయనతోపాటు అర్వింద్ కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మూడేండ్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన కీలక పాత్ర పోషించారు. సీఎం కేసీఆర్ తర్వాత అధికార వర్గాల్లో అంతటి ఇమేజ్ను సంపాదించుకున్నారు. పథకాలు, కార్యక్రమాల రూపకల్పనలో తనదైన ముద్రవేశారు. ఆయనే మంగళవారం వరకూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన సోమేశ్ కుమార్. తాజాగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ ఏడాది చివరి వరకూ ఉన్న ఆయన సర్వీసు, దాంతోపాటు ఆయన భవితవ్యం రెండూ సందిగ్దంలో పడ్డాయి. సోమేశ్ కుమార్ కచ్చితంగా ఏపీకి వెళ్లి తీరాలంటూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయటంతో ఆయన పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో సోమేశ్కు మూడే మూడు మార్గాలున్నాయని మేధావులు, న్యాయ నిపుణులు, రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. కోర్టు తీర్పుననుసరించి ఏపీకి వెళ్లటం, హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించటం, స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) చేయటమనే మూడు మార్గాలను వారు సూచిస్తున్నారు. వీటిలో మొదటి దాని ప్రకారం.. ఏపీకి వెళితే, ఆయన ఏదో ఒక సాధారణ పోస్టులో సర్దుకుపోవాల్సి (లూప్ లైన్లో) ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆయనకు పెద్దగా ప్రాముఖ్యత కలిగిన పదవి ఇచ్చే అవకాశం ఉండదు కాబట్టి. ఇక రెండో దాని ప్రకారం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే... నిబంధనల ప్రకారమే నడుచుకోవాలంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తే, అది హైకోర్టు తీర్పును సమర్థించినట్టే అవుతుంది. అందువల్ల ఈ రెండింటికంటే మూడోదైన స్వచ్ఛంద పదవీ విరమణ తనకు సులవైన పరిష్కారమార్గంగా సోమేశ్ భావిస్తున్నట్టు వినికిడి. ఇదే విషయాన్ని ఆయన తన సన్నిహితులతో చెప్పినట్టు సమాచారం. ఒకవేళ కచ్చితంగా ఏపీకి వెళ్లాల్సి వస్తే 'లాంగ్ లీవ్...' ఒక్కటే మేలైందని ఆయన వాపోయినట్టు తెలిసింది.
మరోవైపు తెలంగాణను వదిలి వెళ్లేందుకు ఆయన విముఖత వ్యక్తం చేస్తున్నారని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. అందువల్ల వీఆర్ఎస్ తీసుకోవటమే మేలని ఆయన భావిస్తున్నారు. అదే జరిగితే సీఎం కేసీఆర్ తనకు అత్యంత దగ్గరి వాడైన సోమేశ్కు ప్రభుత్వంలో కీలక పదవి ఇచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్‌ల్లో తనకు దగ్గరగా ఉన్న వారికి ప్రభుత్వ సలహాదారుల పదవులనివ్వటం ద్వారా సీఎం... వారిని తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. ఆ రకంగానే సోమేశ్ కుమార్‌కు సైతం సలహాదారు పోస్టునిచ్చే అవకాశాల్లేకపోలేదని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అదీ కుదరకపోతే వీఆర్ఎస్ అనంతరం సోమేశ్‌ను బీఆర్ఎస్లో చేర్చుకోవటం ద్వారా ఆయనకు రాజకీయంగా పెద్ద పీట వేయనున్నారనే ఊహాగానాలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఆ తర్వాత ఆయన స్థాయికి తగ్గట్టు కేసీఆర్... పెద్ద పోస్టునిచ్చి కాపాడుకుంటారనే చర్చ కూడా కొనసాగుతున్నది.
మరోవైపు సీఎస్ పదవి నుంచి సోమేశ్ కుమార్ వైదొలిగిన నేపథ్యంలో ఆయన స్థానంలో తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరిని నియమించాలనే దానిపై సీఎం కేసీఆర్ సీరియస్‌గా దృష్టి సారించారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ కె.రామకృష్ణారావును ఆ పదవి వరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఆయన సీఎస్ కుర్చీలో కూర్చుంటే... గతంలో ఆ శాఖలో పని చేసిన సీనియర్ ఐఏఎస్ సందీప్ కుమార్ సుల్తానియాను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించే అవకాశాలున్నాయి. ఇక రామకృష్ణారావుతోపాటు సమాచార పౌర సంబంధాల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న అర్వింద్ కుమార్, సాగునీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న రజత్ కుమార్ కూడా ఆ రేసులో ఉన్నారు.
ఇక సోమేశ్ మాదిరిగానే ఏపీ క్యాడర్ అయిన ఐఏఎస్‌లు రొనాల్డ్ రాస్ (2006 బ్యాచ్), ఏ.వాణీ ప్రసాద్ (1995), వాకాటి కరుణ (2004), ఐపీఎస్‌లు అంజనీ కుమార్ (ప్రస్తుత డీజీపీ-1990 బ్యాచ్), అభిలాష్ బిస్త్ (1994), సంతోష్ మెహ్రా (1987) కూడా తెలంగాణలో కొనసాగుతున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో వీరి భవితవ్యం కూడా ప్రశ్నార్థకంగా మారింది. సోమేశ్ మాదిరిగానే వీరు సైతం ఏపీకి వెళ్లాల్సి వస్తుందా..? లేక ఎవరూ కోర్టుకు పోలేదు కాబట్టి.. తెలంగాణలోనే కొనసాగుతారా..? అనేది వేచి చూడాలి.