Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ జిందాబాద్ ఆధ్వర్యంలో మంగళవారం జీహెచ్ఎంసీ కార్యాలయంలో 67 మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. డిసెంబర్ 25న రాంనగర్ ఎంసీహెచ్ కాలనీలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన 'మెగా మెడికల్ క్యాంప్'లో కంటి పరీక్షలు చేయించుకున్న వారికి అద్దాలు తయారు చేయించి, మంగళవారం ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా టీఎస్ఆరటీసీ సీనియర్ ఆఫీసర్ కిరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉచితంగా వైద్య సేవలు అందించడం చాలా ఉదాత్తమైన కార్యక్రమమని, హైదరాబాద్ జిందాబాద్ కృషిని అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమంలో తనకు భాగస్వామ్యం కల్పించినందుకు సంతోషంగా ఉన్నదని, ప్రతి ఒక్కరూ తమ వరకే కాక సమాజం కోసం ఆలోచించాలని, సాటి మనిషి కోసం ఏదో ఒకటి చేయాలని ఉద్బోధించారు. ఈస్ట్ ఎంసెట్ కాలనీ అధ్యక్షులు శ్రీధర్‌గౌడ్ మాట్లాడుతూ. తమ కాలనీలో వైద్య శిబిరాన్ని నిర్వహించి, ఉచిత కండ్లద్దాలు పంపిణీ చేసిన హైదరాబాద్ జిందాబాద్ సంస్థకు కృతజ్ఞతలు తెలియజేశారు. సినీ నిర్మాత శివనారాయణ వాసిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి హాజరై కండ్ల అద్దాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిందాబాద్ ముషీరాబాద్ డివిజన్ నాయకులు రాజమౌళి, శ్రీవల్లి, నగర ప్రధానకార్యదర్శి కె.వీరయ్య, సంయుక్త కార్యదర్శి ఎం. శ్రీనివాసరావు, పి. నాగేశ్వరరావు తదితరులు నాయకత్వం వహించారు.