Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యల పరిష్కార పోరాట సమితి
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
రాష్ట్ర ప్రభుత్వానికి అరెస్టులపై ఉన్న శ్రద్ధ ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యల పరిష్కారంపై లేకపోవడం విచారకరమని ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యల పరిష్కార పోరాట సమితి, పలు విద్యార్థి సంఘాలు విమర్శించాయి. సోమవారం చలో ప్రగతిభవన్‌కు తరలివస్తున్న యువజన, విద్యార్థి సంఘాల నేతలు, పోలీసు అభ్యర్థులను అక్రమంగా అరెస్టు చేయడం, నిర్బంధించడం, దాడులు చేయడానికి ఖండించాయి. అక్రమ అరెస్టులను నిరసిస్తూ.. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యల పరిష్కార పోరాట సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా మంగళవారం హైదరాబాద్ నారాయణగూడ ఫ్లైఓవర్ వద్ద పలు విద్యార్థి సంఘాలు నిరసన ప్రదర్శన నిర్వహించాయి.
ఈ సందర్భంగా పోరాట సమితి కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యులు వలీ ఉల్లా ఖాద్రీ, కె.ధర్మేంద్ర, నేర్లకంటి శ్రీకాంత్, సత్యప్రసాద్ (ఏఐవైఎఫ్), అనగంటి వెంకటేష్, జావీద్ (డీవైఎఫ్ఐ), సలీం పాషా (వైజే ఎస్), అశోక్ రెడ్డి, సునీల్ (ఎస్ ఎఫ్ఐ), అరుణ్ కుమార్(విజేఎస్) రాష్ట్ర బాధ్యులు మాట్లాడారు. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వల్ల ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. బోర్డ్ చైర్మెన్ రోజువారీ ప్రకటనలు ఆపాలని, అభ్యర్థుల వాదనను బోర్డు పరిగణలోకి తీసుకోవాలని, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.