Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
- పబ్లిక్ అండ్ ప్రయివేట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) సంఘర్ష యాత్రలో..: అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వీరయ్య, శ్రీకాంత్
నవతెలంగాణ-బోధన్/బాన్సువాడ/రామాయంపేట
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మోటారు రవాణా సవరణ చట్టం-2019 ప్రకారం మొత్తం రవాణా రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పే కుట్ర జరుగు తుందని ఆలిండియా పబ్లిక్ అండ్ ప్రయివేట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు ఎస్ వీరయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టం అమలులోకి వస్తే ఆటో, టాక్సీ, మినీ గూడ్స్, బస్సులు.. నడుపుకుంటూ ఉపాధి పొందుతున్న వారు సైతం ఇకపై ఈ వాహనాలన్నింటినీ కార్పొరేట్ సంస్థలకి అప్పజెప్పి వారి కింద దేహి అని బతికేలా కార్మికుల జీవితాలను దిగజార్చే పరిస్థితి తీసుకోచ్చారని అన్నారు. యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రవాణా రంగ కార్మికుల సంఘర్షణ యాత్ర మంగళవారం ఉదయం నిజామాబాద్ జిల్లా బోధన్, కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కొనసాగింది. బోధన్ బస్టాండ్ వద్ద యాత్రకు కార్మికులు, నాయకులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి మెదక్ జిల్లా రామాయంపేట పట్టణానికి చేరుకుంది. రామాయంపేట శివారులోకి ఆటో కార్మికులు పెద్ద ఎత్తున చేరుకొని అధ్యక్షులు వీరయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్లకు పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి మెదక్ క్రాస్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పట్టణాల్లో, అడ్డాల్లో జరిగిన సభల్లో వీరయ్య, శ్రీకాంత్ మాట్లాడారు. కార్పొరేట్ శక్తులను ఎదిరించి రవాణా రంగ వ్యవస్థను కాపాడుకునే విధంగా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ తీసుకువచ్చిన కార్మిక చట్టాల సవరణ వల్ల సంఘాలు పెట్టుకునే హక్కును హరించే ధోరణిని తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీలో అమలు చేస్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతోందని అన్నారు. ఈ ధోరణిని రాష్ట్ర ప్రభుత్వం విడనాడి ఆర్టీసీ సంస్థను పరిరక్షిస్తూ, ఆర్టీసీలో కార్మిక సంఘాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. హక్కులను హరిస్తే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. మోటారు వాహనాల సవరణ చట్టం ప్రకారమే ప్రతిరోజు వాహనాల ఫొటోలు తీస్తూ పెద్ద ఎత్తున జరిమానాలు విధిస్తూ దుర్మార్గపు చర్యకు పాల్పడుతున్నారని అన్నారు. వాహనాలకు జరిమానాలు విధించే పరిస్థితి తెలంగాణకే పరిమితం కాలేదని, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొందన్నారు. ఇది మోడీ చేసిన చట్టం ఫలితమన్నారు. ఈ చట్టాన్ని అడ్డుకోవడానికి దేశవ్యాప్త ఉద్యమాలు రావాలన్నారు. యాత్రలో సీఐటీయూ మెదక్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, నాయకులు, రవాణా రంగ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.