Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు డిమాండ్
- సమాజం రక్షణగా నిలవాలి : సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరయ్య
నవతెలంగాణ-బోధన్
కోటగిరిలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్న మల్లికార్జున్‌ను కులం పేరుతో దూషించి, వేధించిన మతోన్మాదులను కఠినంగా శిక్షించాలని కుల వివక్ష వివక్ష పోరాట సమితి (కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో బాధిత ఉపాధ్యాయున్ని పరామర్శించి మాట్లాడారు. కోటగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న దళిత సామాజిక తరగతికి చెందిన ఉపాధ్యాయుడిని బలిచ్చే గొర్రెను తీసుకెళ్లినట్టుగా బడి నుంచి గుడి వద్దకు బలవంతంగా మెడలు పట్టి లాక్కెళ్లి జై శ్రీరాం అనిపించారని, ఒత్తిడి చేసి బొట్టుపెట్టి ఆయన మనోభావాలు దెబ్బతీశారన్నారు. 2022 సెప్టెంబర్‌లో వినాయక చందా ఇవ్వనందుకు నాటి నుంచి కక్షపెంచుకొని జనవరి 2న ఈ దుర్మార్గానికి ఒడిగట్టారని ఉపాధ్యాయుడు ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిపారు. కులం పేరుతో దూషించి తీవ్రమైన పరుష పదజాలంతో హేళన చేశారని అన్నారు. ఒక టీచర్ సైన్స్ హేతువాదాన్ని మాత్రమే బోధిస్తాడని, మూఢత్వాలు ఎందుకు బోధిస్తాడని ప్రశ్నించారు? సైన్స్ బోధించడం నేరం కాదన్నారు. ఉపాధ్యాయున్ని అవమానించిన దుండగులను ప్రభుత్వం అరెస్ట్ చేయడంలో జాప్యం చేయడం సరికాదన్నారు.
దౌర్జన్యం చేసిన మతోన్మాద దుండగులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు హత్యాయత్నం నమోదు చేయాలని, అలాగే ప్రభుత్వ విధులకు ఆటంకపర్చినందుకు కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జిల్లా పోలీసు కమీషనర్, కలెక్టర్ జోక్యం చేసుకొని తక్షణమే దుండగులను అరెస్ట్ చేయాల న్నారు. ఆయనకు ప్రాణభయం ఉందని, ఆయన కుటుంబానికి పూర్తిస్థాయిలో రక్షణ కల్పించాలని కోరారు. లేకుంటే కేవీపీఎస్ ఆధ్వర్యంలో అన్ని సామాజిక ప్రజాసంఘాలను కలుపుకొని ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. అనంతరం టీచర్ మల్లిఖార్జున్‌ను పూలదండ, శాలువతో ఘనంగా సన్మానించారు. పరామర్శిన వారిలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మల్యాల సుమన్, కొండ గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షులు నల్వాల నర్సయ్య, జిల్లా కమిటీ సభ్యులు డి. శంకర్, భాస్కర్, రైతుసంఘం నాయకులు భాస్కర్, సీఐటీయూ వ్యవసాయ కార్మికసంఘాల జిల్లా అధ్యక్షులు ఎం.గంగాధరప్ప, శంకర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుడు మల్లికార్జున్‌కు సమాజం
అండగా నిలవాలి : సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరయ్య
కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న మల్లికార్జున్‌ను కొంతమంది ఉద్దేశపూర్వకంగా మతం పేరుతో అవమానపరచడం సహించలేనిదని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య అన్నారు. మతోన్మాదుల చేతిలో అవమానాల పాలైన ఉపాధ్యాయుడికి సమాజం అండగా నిలవాలని కోరారు. మంగళవారం ఆయన బోధన్ పట్టణంలోని బాధిత ఉపాధ్యాయ కుటుంబాన్ని పరామర్శించి మాట్లాడారు. ప్రతి వ్యక్తిలోనూ ఆస్తికత్వం, నాస్తికత్వం ఉంటాయని, ఆస్తికులంతా దేశ పౌరులు, నాస్తికులంతా దేశద్రోహులు అనడం సమంజసం కాదన్నారు. దళితుడైన మల్లికార్జున్ టీచర్‌గా ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యను బోధిస్తు న్నాడని అన్నారు. మనిషిని మనిషిగా చూడలేని ఈ వ్యక్తులు ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తారని ప్రశ్నించారు. ప్రతి వ్యక్తికి భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, మతాన్ని స్వీకరించే స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించిందని అన్నారు. టీచర్‌ను బెదిరించి అవమానపరిచిన వారిపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మల్లికార్జున్ కుటుంబానికి సీఐటీయూ తరఫున పూర్తి సహకారం ఉంటుందని భరోసాని చ్చారు. ఆయన వెంట కార్యదర్శులు శ్రీకాంత్, రమేష్, జిల్లా సీఐటీయూ కార్యదర్శి నూర్జహాన్, అధ్యక్షులు శంకర్‌గౌడ్, తదితరులున్నారు.