Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సోమేశ్ కుమార్‌కు హైకోర్టు ఆదేశాలు
- క్యాడర్ కేటాయింపు వివాదంపై కీలక తీర్పు
- గతంలో క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులు కొట్టివేత
- రేపటిలోగా ఆంధ్రా సర్వీసుల్లో చేరాలంటూ డీవోపీటీ ఆదేశాలు
నవతెలంగాణ - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ (1989 బ్యాచ్, ఏపీ క్యాడర్)... ఆంధ్రప్రదేశ్ సర్వీసులో చేరాల్సిందేనంటూ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. తెలంగాణ సర్వీసులో సోమేశ్ కుమార్ కొనసాగొచ్చంటూ 2016లో కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) ఇచ్చిన తీర్పును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సూరేపల్లి నందలతో కూడిన ధర్మాసనం కొట్టేసింది. తీర్పు అమలును మూడు వారాలపాటు నిలిపేయాలన్న సోమేశ్‌కుమార్ తరపు కౌన్సిల్ వినతిని కోర్టు నిర్ద్వందంగా తోసిపుచ్చింది.
హైకోర్టు తీర్పు వెలువడిన గంటల వ్యవధిలోనే...అఖిల భారత సర్వీసు అధికారుల వ్యవహారాలు చూసే డిపార్టుమెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) కార్యదర్శి అన్షుమన్ మిశ్ర కీలక ఆదేశాలు జారీచేశారు. గురువారం (ఈనెల 12)లోగా ఆంధ్రప్రదేశ్ సర్వీసులో చేరాలంటూ సోమేశ్ కుమార్‌కు స్పష్టంచేశారు. ఈ క్రమంలో తెలం గాణ సర్వీసులో కొనసాగేందుకు ఆయనకున్న దారులన్నీ మూసుకు పోయాయి. ఈ క్రమంలో కొత్త సీఎస్ ఎంపికపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు షురూ చేసింది.
ఇదీ కేసు నేపథ్యం...
ఏపీ పునర్విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య అఖిల భారత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల సర్దుబాటుకు సెంట్రల్ విజిలెన్స్ మాజీ కమిషనర్ ప్రత్యూష్ సిన్హా నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీని కేంద్రం నియమించింది. అన్ని కసరత్తులను పూర్తిచేసిన ఆ కమిటీ.. రెండు రాష్ట్రాలకు ఆలిండియా సర్వీసెస్ (ఏఐఎస్) అధికారులను కేటాయిస్తూ 2014 సెప్టెంబర్‌లో ఉత్తర్వులు జారీచేసింది. ఆ ప్రకారంగా తెలం గాణకు 133 మంది ఐఏఎస్, 95 మంది ఐపీఎస్, 58 మంది ఐఎఫ్ఎస్ల ను...ఏపీకి 161 ఐఏఎస్, 116 ఐపీఎస్, 69 ఐఎఫ్ఎస్లను కేటాయించింది. ఆ ప్రకారంగా సోమేశ్ కుమార్ ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే తాను తెలంగాణలోనే కొనసాగుతానంటూ సోమేశ్‌కుమార్ క్యాట్‌ను ఆశ్రయించారు. 2016 మార్చిలో ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువడింది. అయితే, క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ డీవోపీటీ 2017లో తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ (4938/2017) దాఖలు చేసింది. ఈ కేసులో ఐదేండ్లకు పైగా సుదీర్ఘ వాదోపవాదాలు కొనసాగాయి. ఐఏఎస్ సర్వీసులకు సంబంధించి చట్ట ప్రకారం నిర్ణయాధికారం కేంద్రం పరిధిలోని డీవోపీటీకే ఉంటుందనీ, క్యాట్ అన్ని విషయాలనూ పరిశీలించలేదని హైకోర్టులో డీవోపీటీ కౌన్సిల్ టి.సూర్య నారాయణ రెడ్డి వాదనలు వినిపించారు. ఏఐఎస్ అధికారుల సర్వీసు కేసులకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు డీవోపీటీ అధికారాలను సమర్థించాయని తెలిపారు. వాదోపవాదాల అనంతరం... గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కోడ్ చేస్తూ సీజే ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం.. మంగళవారం 89 పేజీల తీర్పును వెలువరించింది.