Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెస్ ఎన్నికల ఫలితం ట్రైలర్ మాత్రమే..
- పెట్రో డీజిల్, సిలిండర్ ధరలు పెంచిన మోడీ దేవుడెలా? : మంత్రి కేటీఆర్
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
''పెట్రో డీజిల్, సిలిండర్ సహా అన్ని రకాల నిత్యావసర సరుకుల ధరలు పెంచిన మోడీ.. ప్రజలకు దేవుడెలా అవుతాడు? ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి, గుజరాత్ ప్రజలకు మాత్రమే దేవుడవుతాడు. కర్ణాటక, మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ ఆ రాష్ట్రాల మధ్య గెట్టు పంచాయితీ తేల్చలేకపోతోంది. అలాంటి పార్టీ నేత మోడీ రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాడని చెప్పటం సిగ్గుచేటు.. సిరిసిల్ల సెస్ ఎన్నికలు ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందు చూపిస్తాం'' అని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం రాజన్నసిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ (సెస్) పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. తెలంగాణకు కేంద్రం నిధుల విషయంలో మంత్రి కేటీఆర్ బీజేపీ నేతలకు మళ్లీ సవాల్ విసిరారు. ఇప్పటివరకు రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ.3.68లక్షల కోట్లు వెళ్లాయని, కేంద్రం మాత్రం తెలంగాణకు రూ.2లక్షల కోట్లు మాత్రమే ఇచ్చిందని తెలిపారు. ఈ విషయంలో తాను చెప్పింది తప్పని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. గుజరాత్లో దోచుకున్న సంపదను బీజేపీ నేతలు సెస్ ఎన్నికల్లో ఖర్చు చేశారని విమర్శించారు. '24వ తేదీ సెస్ ఎన్నికలు.. మాకు 22, 23 తేదీల్లో ఫోన్లు వచ్చాయి. బండి సంజరు ఇక్కడికి వచ్చిర్రు. మండలానికి రూ.30లక్షలకుపైగానే పంచిర్రు. సంజరు రూ.4.5కోట్లు పంచినా రైతాంగం, ప్రజల్లో బీఆర్ఎస్పై నమ్మకం ఉందని, మన పాలన పట్ల ఆదరణ చూపిస్తారని మా వాళ్లకు చెప్పిన' అన్నారు. బీఆర్ఎస్ పట్ల ప్రజల ఆదరణ ఫలితాల్లో తేలిందన్నారు. ఇన్ని కోట్లు పంచినా బీజేపీ కనీసం ఒక్క డైరెక్టర్ స్థానం కూడా గెలుచుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. ఈ సెస్ ఎన్నికలు బీజేపీకి తమ పార్టీ ట్రైలర్ మాత్రమేనని, 2023 ఎన్నికల్లో అసలు సినిమా చూపిస్తామని స్పష్టం చేశారు. బీజేపీకి దమ్ముంటే అనవసర విమర్శలు ఆపి.. కనీసం కొన్ని మంచి పనులైనా చేసి చూపించాలని హితవు పలికారు.