Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నన్ను టార్గెట్ చేసేందుకు నలుగురు సీఎంలతో బహిరంగ సభ
- పోడు భూముల సమస్యను పరిష్కరించలేదు
- ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి
నవతెలంగాణ-మణుగూరు
ఎవరి అండా లేకుండా రాజకీయాల్లో స్వయం శక్తితో ఎదిగాననీ, ప్రజలే తన రాజకీయ గాడ్ ఫాదర్ అని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం మణుగూరు మండలం తోగ్గూడెం పంచాయతీ సమ్మక్క సారక్క ఆలయ ప్రాంగణంలో డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య అధ్యక్షతన పినపాక నియోజకవర్గం ఆత్మీయ సమ్మేళనం మంగళవారం నిర్వహించారు. దీనికి పొంగులేటి హాజరై మాట్లాడారు. నాలుగేండ్లలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా మౌనంగా భరించానని తెలిపారు. పదవి లేకున్నా ప్రజల్లో ఉంటూ సాయం చేస్తూనే ఉంటానని స్పష్టంచేశారు. రాబోయే సాధారణ ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు. సంక్రాంతి పండుగలో వచ్చే గంగిరెద్దును కాదనీ, మౌనం అంగీకారం అనుకుంటే సరికాదనీ, మనసులో ఎన్నో బాధలు, గాయాలు ఉంటాయనీ, ప్రేమా, గౌరవం లేని చోట తాను ఇమడలేనన్నారు. సెక్యూరిటీలను తీసేసినా నొచ్చుకోలేదని, ప్రజలే నాకు సెక్యూరిటీ అని తెలిపారు. కష్టపడి సంపాధించిన ధనాన్ని ఇన్కమ్ టాక్స్ కట్టిన తర్వాత మిగిలిన దాన్ని ప్రజలకు పంచుతున్నానన్నారు. రాబోయే కాలంలో ప్రజా తీర్పును గౌరవిస్తానన్నారు. నాలుగేండ్లలో పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపులేకపోయారని అన్నారు.
ప్రజలను పాలకులు చిత్రహింసలు పెడుతున్నారనీ, తిరిగి వడ్డీతో చెల్లించాల్సి వస్తుందని పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ఎన్నికల కోసం రాలేదని చెప్పారు. రాష్ట్రంలో ఎన్ని వేల కోట్ల రూపాయల పనులు చేశానో, ఎంత సంపాదించానో త్వరలోనే ప్రజల ముందు ఉంచుతానని తెలిపారు. రాష్ట్రం ఏర్పడకముందే పదిమంది కాంట్రాక్టర్లల్లో నేనూ ఒక ప్రముఖ కాంట్రాక్టర్ అని, రాజకీయాల్లోకి వచ్చి కాంట్రాక్టర్ని కాలేదన్నారు. నన్ను టార్గెట్ చేసేందుకు ఖమ్మంలో నలుగురు ముఖ్యమంత్రితో బహిరంగ సభ పెడుతున్నారని అన్నారు. ఇబ్బందులు పెట్టినా, ఆర్థికంగా నష్టపోయినా ప్రజల వద్దకు జోల పట్టుకొని అడుక్కుంటూ రాజకీయం చేస్తానన్నారు.
నాలుగేండ్ల కాలంలో కేసీఆర్, తనది తండ్రి కొడుకుల బంధంగా భావించాననీ, కానీ అటువైపు నుంచి ఏమీ దక్కకపోవడంతో రాజకీయ నిర్ణయం తీసుకుంటు న్నానని తెలిపారు. పినపాక మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. నియోజక వర్గంలో తన హయాంలోనే అభివృద్ధి జరిగింద న్నారు. రూ.400 కోట్లు నేనే తెచ్చానని, వాటికి శంకుస్థాపన చేస్తూ ప్రస్తుత ఎమ్మెల్యే కాలయాపన చేస్తున్నారని చెప్పారు. భూ కబ్జాలు, భూదందాలు, ఇసుక మాఫియా చేస్తూ కార్ల మీద కార్లు కొంటూ దోచుకుని దాచుకుంటున్నారని ఘాటుగా విమర్శిం చారు. అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు. కార్యక్ర మంలో జాలే ఆదినారాయణ, మువ్వ విజయబాబు, ముత్తినేని సుజాత, కె.వి. రావు, పుచ్చకాయల శంకర్, బల్లెం సురేష్, ఎస్కే బాజీ, నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోని 117 పంచాయతీల నుంచి అధిక సంఖ్యలో పొంగులేటి అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.