Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
గ్రూప్ 1 పోస్టుల ఫలితాలను వెల్లడించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు హైకోర్టు అనుమతిచ్చింది. 'ఒకటి నుంచి పీజీ వరకు తెలంగాణలో చదివా..ఏడో తరగతి విశాఖలో చదివాననే కారణంతో నాకు స్థానికత వర్తించబోదంటూ కమిషన్ చెప్పడంపై...' నీహారిక అనే అభ్యర్థిని గతంలో రిట్ దాఖలు చేశారు. ఆమెకు స్థానికతను అమలు చేయాలంటూ సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇచ్చిన కారణంగా ఫలితాల వెల్లడి ఆగిపోయింది. దీంతో కమిషన్ అప్పీల్ పిటిషన్‌ను వేయగా, బుధవారం జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలితో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. ఫలితాలను వెల్లడించేందుకు అనుమతిని ఇచ్చింది. స్థానికతపై తాము విచారించి ఉత్తర్వులు ఇస్తామంటూ తెలిపింది.
ఎమ్మెల్యేల కేసు 18కి వాయిదా..
ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంపై సీబీఐ దర్యాప్తును రద్దు చేయాలంటూ ప్రభుత్వం వేసిన అప్పీల్ పిటిషన్‌పై విచారణను ఈనెల 18కి వాయిదా వేస్తూ చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో కూడిన బెంచ్ బుధవారం ప్రకటన విడుదల చేసింది. సీనియర్ లాయర్ దుష్యంత్ దవే జ్వరంతో బాధపడుతున్న నేపథ్యంలో విచారణకు ఆయన హాజరు కాలేకపోవటంతో విచారణ వాయిదా పడింది.
జప్తును విడుదల చేయండి...
ముసద్దీలాల్ జెమ్స్ జ్యువెలరీ లిమిటెడ్ నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం, డాక్యుమెంట్లను విడుదల చేయాలంటూ ఈడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమపై కేసు లేకపోయినా ఈడీ సీజ్ చేయడాన్ని ముసద్దీలాల్ సవాల్ చేసిన కేసులో సింగిల్ జడ్జి ఉత్తర్వులిచ్చారు.
మాస్టర్ ప్లాన్‌పై కౌంటర్ వేయండి...
కామరెడ్డి మున్సిపాల్టీ మాస్టర్ ప్లాన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన కేసులో ప్రభుత్వం కౌంటర్ పిటిషన్‌ను దాఖలు చేయాలంటూ హైకోర్టు ఆదేశించింది. స్థానిక రాజకీయ నేతలకు మేలు కలిగేలా మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారనీ, అందువల్ల ముసాయిదా ప్లాన్‌పై స్టేటస్కో ఇవ్వాలంటూ రైతులు చేసిన వినతిని హైకోర్టు తోసిపుచ్చింది. 40 మంది రైతులు వేసిన కేసులో ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం... మాస్టర్ ప్లాన్‌పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. వరంగల్, హైదరాబాద్‌కు చెందిన మాస్టర్ ప్లాన్లలో కదలికల్లేవని గుర్తు చేసింది. విచారణను ఈనెల 25కి వాయిదా వేస్తూ జస్టిస్ భాస్కర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికిప్పుడు ఏమీ కాదంటూ హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. మాస్టర్‌ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ రామేశ్వరపల్లి రెండో వార్డుకు చెందిన 40 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తమను సంప్రదించకుండానే భూములను రిక్రియేషన్ జోన్‌గా ప్రకటించారనీ, అందువల్ల తమకు న్యాయం చేయాలంటూ వారు రిట్లో పేర్కొన్నారు.
ఆస్పత్రుల్లో వసతులపై వివరాలివ్వండి...
నాగర్ కర్నూల్ జిల్లాలో వైద్యమందక తల్లీబిడ్డా మరణించిన ఘటనపై హైకోర్టు మానవీయతతో స్పందించింది. పదర మండలం వంకేశ్వరం గ్రామానికి చెందిన స్వర్ణకు గత నెల 26న రాత్రి 8:30 గంటల సమయంలో పురిటినొప్పులు రావడంతో అంబులెన్స్‌లో పదర పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి అమ్రాబాద్ పీహెచ్‌సీకి తరలించారు. డాక్టర్ లేకపోవడంతో అచ్చంపేట ఆస్పత్రికీ, ఇక్కడి వైద్యుల సూచనలకు అనుగుణంగా మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. పురుడు పోసుకున్న కొద్దిసేపటికి తల్లీ శిశువులిద్దరూ మరణించారు. ఈ ఘటనపై పత్రికల్లో వచ్చిన వార్తలను హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించింది. చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించి ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. విచారణను వాయిదా వేసింది.