Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిభావంతులకు రూ.6.50 కోట్ల స్కాలర్షిప్లు
- అనురాగ్ వర్సిటీ వీసీ రామచంద్రం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అనురాగ్ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు 'అనురాగ్ సెట్' నిర్వహిస్తున్నామని ఆ వర్సిటీ వీసీ ఎస్ రామచంద్రం చెప్పారు. ఈనెల 29న ఆఫ్‌లైన్, ఆన్లైన్లో రాతపరీక్ష ఉంటుందని వివరించారు. హైదరాబాద్‌లోని ఆ వర్సిటీ ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనురాగ్ వర్సిటీ సెట్‌కు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైందని అన్నారు. దరఖాస్తు చేసేందుకు ఈనెల 28వ తేదీ వరకు గడువుందన్నారు. ఏపీ, తెలంగాణలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సెట్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రూ.6.50 కోట్ల వరకు స్కాలర్షిప్లు అందిస్తామని వివరించారు. మొదటి పది ర్యాంకులు పొందిన విద్యార్థులకు వంద శాతం ఫీజు మినహాయింపు ఉంటుందనీ, ఉచిత విద్య అందిస్తామని అన్నారు. 11 నుంచి 25 ర్యాంకుల వరకు 50 శాతం, 26 నుంచి 100 ర్యాంకుల వరకు 25 శాతం ఫీజులో రాయితీ ఇస్తామని చెప్పారు. అనురాగ్ సెట్ ద్వారా ప్రవేశాలు పొందిన మొదటి 500 మంది విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందిస్తామని వివరించారు. ఎంసెట్, జేఈఈ మెయిన్‌లో ర్యాంకులు పొందిన వారికీ ఫీజులో మినహాయింపు ఉంటుందన్నారు. అనురాగ్ విశ్వవిద్యాలయ సీఈవో ఎస్ నీలిమ మాట్లాడుతూ వర్సిటీలో ఐదు వేల సీట్లు, ఎంసెట్ ద్వారా కన్వీనర్ కోటాలో 1,200 సీట్లు ఉన్నా యని చెప్పారు. ఈ కార్యక్రమంలో అనురాగ్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ సమీన్ ఫాతిమా, అనురాగ్ సెట్ కన్వీనర్, అడ్మిషన్ల డైరెక్టర్ మహీపతి శ్రీనివాసరావు, డీన్లు ముత్తారెడ్డి, సుధీర్‌రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.