Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ ఆగడాలను అడ్డుకోవాలి: మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
గత ఎన్నికల ముందు బీఆర్ఎస్ ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు మ్యానిఫెస్టోలో ప్రకటించిన అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే పంచాలన్నారు. మిగిలిన వారికి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. అర్హులైన పేదలందరికీ రేషన్‌కార్డులు,పెన్షన్లు మంజూరు చేయాలన్నారు. ఈ ఏడాది రైతుబంధు కింద రూ.4600 కోట్లు మాత్రమే విడుదల చేశారని, ఇంకా రూ.3000 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే వాటిని విడుదల చేసి రైతులందరికీ న్యాయం చేయాలన్నారు. పోడు భూముల విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ పట్టాలివ్వాలని కోరారు. లిఫ్టుల పరిస్థితి అధ్వానంగా ఉందని, ప్రభుత్వమే బాధ్యతగా తీసుకొని మరమ్మతులు చేపట్టి ప్రాజెక్టు అంతర్భాగంగా చూడాలన్నారు. ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు వెంటనే భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను, ప్రజాసంఘాలను కలుపుకొని పోయి దాన్ని అడ్డుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్, డా.మల్లుగౌతమ్‌రెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, తిరుపతిరామ్మూర్తి, లక్ష్మీనారాయణ,పాల్వాయి రాంరెడ్డి ఉన్నారు.