Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీచర్ మల్లికార్జునకు అండగా ఉంటాం
- దాడిచేసిన వారిని 24 గంటల్లోగా అరెస్ట్ చేయకుంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు
- చలో కోటగిరికి వామపక్ష, బహుజన,విద్యార్థి సంఘాలు
నవతెలంగాణ-కోటగిరి
'కొందరు రాష్ట్రాన్ని మరో ఉత్తరభారతం చేయాలని తెలంగాణలో కలలు కంటున్నారని, తెలంగాణ ఉద్యమాల గడ్డ. ఎందరో వీరుల త్యాగాల వలన తెచ్చుకున్న తెలంగాణలో మనువాదుల నాటకాలు ఇక్కడ సాగనివ్వబోమని, మను ధర్మానికి వ్యతిరేకంగా నిరంతరం పోరాడి టీచర్ మల్లికార్జునకు అండగా ఉంటామని వామపక్ష, బహుజన, విద్యార్థి సంఘాల నాయకులు స్పష్టంచేశారు. నిజామాబాద్ జిల్లా కోటగిరిలో దళిత టీచర్‌ను కులంపేరుతో దూషించి బలవంతంగా గుడికి తీసుకెళ్లి అవమానించిన దుండగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల, బహుజన, విద్యార్థి సంఘాల నాయకులు బుధవారం చలో కోటగిరికి తరలివెళ్లారు. కోటగిరి కొత్త బస్టాండ్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం న్యాయవాది ఈశ్వర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పలువురు మాట్లాడారు. దళితుడైన మల్లికార్జున్‌ను కులం పేరుతో దూషించి దాడి చేయడంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినా నిందితులను ఇప్పటికీ అరెస్ట్ చేయకపోవడం సరికాదన్నారు. నాలుగు నెలల కిందట వినాయక చందా కోసం వచ్చిన వారికి చందా ఇవ్వలేదన్న కారణంతో.. ఉపాధ్యాయుడు మల్లికార్జున్‌ను అవమానించి దేవాలయంలోకి తీసుకువెళ్లడం ఎంతవరకు సమంజసమని ముక్తకంఠంతో ఖండించారు. రాజ్యాంగ హక్కుల కోసం, బావప్రకటన స్వేచ్ఛ కోసం నిరంతరం పోరాడుతూనే, విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేలా శాస్త్రీయ దృక్పథం అలవర్చేలా విద్యను బోధించడం మంచిది కాదా అని ప్రశ్నించారు. మతోన్మాద శక్తులకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని, ఆర్టికల్ 24 ప్రకారం భావ ప్రకటన హక్కును కాలరాసే హక్కు ఎవరిచ్చారని 48 గంటల్లో గాండ్ల శ్రీను తదితరులను అరెస్టు చేయకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మల్లికార్జున్‌పై ఈగ వాలితే చూస్తూ ఊరుకోమని, రుద్రూర్ నాయకులు మల్లికార్జున ఫోన్ చేసి ఇబ్బందులకు గురి చేశాడని, వెంటనే అతన్ని అరెస్టు చేయాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేశ్‌బాబు, సీపీఐ ప్రజాపంథా నాయకులు ప్రభాకర్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, అధ్యక్షులు శంకర్ గౌడ్, తెలంగాణ రైతు సంఘం అధ్యక్షులు యేశాల గంగాధర్, బహుజన సమాజ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు నీరడి ఈశ్వర్, కుల నిర్మాణ రాష్ట్ర నాయకులు అభినవ్, మానవ హక్కుల సంఘం నాయకులు ప్రొఫెసర్ సరిత, అట్రాసిటీ పరిరక్షణ నాయకులు చెన్నయ్య, దళిత నాయకులు బంగారు సాయిలు, స్వేరోస్ రాష్ట్ర నాయకులు కలిగోడు సాయన్న, సేవ్ సొసైటీ జిల్లా అధ్యక్షులు లింబూర్ లక్ష్మణ్, తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు విద్యాసాగర్, బీఎస్పీ జిల్లా కోశాధికారి గణేష్, జిల్లా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులు గైక్వాడ్ రాం చందర్, చిలుక శ్రీనివాస్, పీడీఎస్‌యూ, ఎస్ఎఫ్ఐ నాయకులు, మాల మహానాడు మండల అధ్యక్షులు మీర్జాపూర్ సాయన్న, నాయకులు తదితరులు పాల్గొన్నారు.