Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గురి తప్పిన జాతీయ ట్రయల్స్,
- షూటర్ మారియాకు అవస్థలు
- గురుకులం నుంచి జాతీయ స్థాయికి చేరిన వైనం
- ఆమె ఖాతాలో అనేక పతకాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
జాతీయ ట్రయల్స్‌లో పాల్గొనే అర్హత సాధించాలంటే ఆషామాషి కాదు.. మొదట జిల్లా స్థాయిలో.. తదుపరి రాష్ట్ర స్థాయి ఆ తర్వాత జాతీయ స్థాయిలో అర్హత పాయింట్లు సాధిస్తూనే, జాతీయ జట్టు కోసం నిర్వహించే ట్రయల్స్‌లో పాల్గొనే అవకాశం దక్కుతుంది. ఇలాంటి అవకాశం కోసం రైఫిల్ షూటింగ్ క్రీడాకారులు ఏండ్ల కొద్దీ సాధన చేసి ఒక్కొక్క క్రీడాకారుడు నాలుగు నుంచి ఆరు సార్లు జాతీయ పోటీల్లో పాల్గొని అర్హత సాధించిన సందర్భాలు ఎన్నో. అలాంటి పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్న తెలంగాణ బిడ్డ రైఫిల్ షూటర్ మారియా గురుకులం నుంచి జాతీయ స్థాయికి ఎదిగింది. ఇప్పటి వరకు సెకండ్ హ్యాండ్ రైఫిల్‌తోనే నెట్టుకొచ్చినా.. ఇకపై అది సరిలేక జాతీయ స్థాయి ట్రయల్స్‌లోనే పాల్గొనే అవకాశం కోల్పోయింది. తెలంగాణ రైఫిల్ షూటర్ మారియా తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో 2018లో తన రైఫిల్ షూటింగ్ ప్రస్థానం మొదలుపెట్టి.. జిల్లా స్థాయిలో బంగారు పతకం, రాష్ట్ర స్థాయిలో వెండి పతకం సాధించింది. 2019లో భోపాల్‌లో జరిగిన 63వ జాతీయ పోటీలలో అడుగుపెట్టిన మారియా, జాతీయ స్థాయి 508వ ర్యాంక్‌లో నిలిచింది. అంచెలంచెలుగా తన శిక్షణను మెరుగుపరచుకుంటూ, 2021లో ఢిల్లీలో జరిగిన 64వ జాతీయ రైఫిల్ షూటింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో 286వ ర్యాంక్ సాధించింది. మారియా ప్రతిభను ప్రోత్సహించిన తండ్రి ఖదీర్ ఉత్తమ శిక్షణ కోసం పూణేలోని బాలివాడి శిక్షణా కేంద్రంలో చేర్పించారు. 2022 సెప్టెంబర్‌లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన ఇండియన్ పబ్లిక్ స్కూల్స్ ఛాంపియన్ షిప్(ఐపీఎస్సీ) పోటీల్లో వ్యక్తిగత రజత పతకం, టీమ్ బంగారు పతకం సాధించింది. 2022 డిసెంబర్, కేరళలోని తిరువనంతపురంలో జరిగిన 65వ జాతీయ రైఫిల్ షూటింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో జాతీయ స్థాయి 116వ ర్యాంక్ సాధించిన మారియా జనవరి 16వ తేదీ నుంచి మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరగనున్న ట్రయల్స్‌లో పాల్గొనే అర్హత సాధించింది, కానీ తన రైఫిల్ తరచూ మొరాయిస్తూ సహకరించనందున ట్రయల్స్ స్థాయి పోటీలకు ఆడలేక పోతున్నానని అంటోంది మారియా. మారియా తండ్రి ఖదీర్ ప్రయివేటు ఉపాధ్యా యుడు. నేటి వరకు ఎవరి ఆర్థిక సహాయ సహకారం లేకుండానే నెట్టుకొస్తున్నారు. మారియాకు సెకండ్ హ్యాండ్ రైఫిల్ షూటింగ్ కిట్, ప్రతి నెలా పదిహేను రోజులు పూణేలోని బాలివాడి శిక్షణా కేంద్రంలో ప్రముఖ శిక్షకులు సుందర్ ఘాటే వద్ద శిక్షణ, ఫిజియో, మొదలగు సౌకర్యాలు కల్పించి మూడుసార్లు జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించారు. కానీ కరోనా తదుపరి ఉదరంలో హెర్నియా శస్త్రచికిత్స కారణంగా ఆర్థిక పరిస్థితులు బాగా దెబ్బతిన్నందున, మారియాకు శిక్షణ, కొత్త రైఫిల్ కొనలేక పోయాననీ తండ్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి విన్నపం ద్వారా అభ్యర్థించాననీ, ప్రభుత్వం సహకరిస్తే మారియా జాతీయ జట్టులో స్థానం దక్కించుకుని, దేశం కోసం ఆడుతుందని ఖదీర్ వేడుకుంటున్నారు.