Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా బీజేపీ ఏకపక్ష నిర్ణయం
- శాస్త్ర సాంకేతిక యుగంలో తిరోగమన పోకడలు
- విద్యాకార్పొరేటీకరణే మోడీ సర్కారు లక్ష్యం
- తెలంగాణలో సీపీఎస్‌ను రద్దు చేసి కేంద్రంపై బీఆర్ఎస్ పోరాడాలి
- రాష్ట్ర్ర ప్రభుత్వాలకు ఓపీఎస్ అమలు చేసే హక్కు లేదనడం దుర్మార్గం
- 317 జీవో బాధితులకు న్యాయం చేయాలి
- 'మన ఊరు-మనబడి' ప్రచారార్భాటం కావొద్దు
- ఉపాధ్యాయ ఖాళీలతో విద్యార్థులకు నష్టం
- పదోన్నతులు, బదిలీలు, నియామకాల కోసం ఐక్యఉద్యమాలు నిర్మిస్తాం : నవతెలంగాణతో టీఎస్‌యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావ రవి
నూతన విద్యావిధానం(ఎన్ఈపీ)-2020ని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం జాతివిభజన కోసమే ఏకపక్షంగా తెచ్చిందని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) ప్రధాన కార్యదర్శి చావ రవి విమర్శించారు. ఎన్ఈపీ రాజ్యాంగ విలువలకు విరుద్ధమని చెప్పారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న ఆధునిక కాలంలో తిరోగమన పోకడలతో విద్యావిధానాన్ని రూపొందించడం సరైంది కాదన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, నానో టెక్నాలజీ, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్ వంటి కోర్సులు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో సంస్కృతం, జ్యోతిష్యం వంటి కోర్సులు చదవాలనడం తిరోగమన విధానమేనని విమర్శించారు. విద్యాకేంద్రీకరణ, వ్యాపారీకరణ, కాషాయీకరణ, కార్పొరేటీకరణ కోసమే ఎన్ఈపీని తెచ్చిందన్నారు. రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం (సీపీఎస్)ను రద్దు చేసి కేంద్రంపై బీఆర్ఎస్ పోరాడాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. అయితే సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను అమలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదంటూ కేంద్రం ప్రకటించడం దుర్మార్గమని విమర్శించారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) చట్టాన్ని రద్దు చేయాలనీ, లేదంటే నిబంధనలను సవరించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈనెల 13,14 తేదీల్లో రంగారెడ్డి జిల్లా సాగర్ రోడ్ మన్నెగూడలో ఉన్న బీఎంఆర్ సార్థా కన్వెన్షన్‌లో నిర్వహించనున్నటీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ఐదో మహాసభల సందర్భంగా నవతెలంగాణ ప్రతినిధి బొల్లె జగదీశ్వర్‌కు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు...
విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ విధానాలు
ఎలా ఉన్నాయంటారు?
తెలంగాణ ఆవిర్భవించిన ఈ ఎనిమిదేండ్ల కాలంలో విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ వహించలేదు. గురుకులాలకు ఎక్కువ ఖర్చు పెట్టి ప్రభుత్వ పాఠశాలలను గాలికొదిలేసింది. పర్ఫార్మింగ్ గ్రేడింగ్ ఇండెక్స్ (పీజీఐ)లో తెలంగాణ 25వ స్థానానికి పడిపోయింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు 'మన ఊరు-మనబడి' పథకంతోపాటు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టింది. ఇది మంచి నిర్ణయం. రూ.7,289 కోట్లతో 12 రకాల మౌలిక వసతులను కల్పించాలని నిర్ణయించింది. మొదటి విడతలో 9,123 బడుల్లో రూ.3,497.62 కోట్లు ఖర్చు చేయనున్నట్టు ప్రకటించింది. ఇప్పటి వరకు 30 శాతం బడుల్లోనూ పనులు పూర్తికాలేదు. ఇది ప్రచారార్భాటం కోసం కాకుండా ఆచరణలో అమలు జరగాలి. అవసరమైన నిధులను విడుదల చేసి పనులు పూర్తి చేయాలి.
విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలు పెంచేందుకు ప్రవేశపెట్టిన తొలిమెట్టు కార్యక్రమం ఎలాంటి ఫలితాలనిస్తున్నది?
విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలు పడిపోయాయి. ఎనిమిదో తరగతి విద్యార్థులు మూడో తరగతి పాఠాలను చదవడం లేదు. అక్షరాలు, అంకెలు నేర్పించడం కోసమే తొలిమెట్టు కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీన్ని ఆహ్వానిస్తున్నాం. అయితే అభ్యసనా సామర్థ్యాలు పడిపోవడానికి ఉపాధ్యాయుల బోధన మాత్రమే కారణం కాదు. ఉపాధ్యాయుల కొరత, అధికారుల పర్యవేక్షణ, మౌలిక వసతుల కల్పన వంటివి ప్రభావం చూపుతాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 25 వేల వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలి. ఇంగ్లీష్ మీడియం బోధన కోసం ప్రత్యేకంగా టీచర్లను నియమించాలి. ఏదైనా కార్యక్రమం ప్రవేశపెట్టే ముందు ఉపాధ్యాయులతో చర్చించాలి. అప్పుడే క్షేత్రస్థాయిలో ఉండే ఇబ్బందులు ప్రభుత్వానికి అర్థమవుతాయి. కానీ అధికారులు పెత్తందారీ పోకడలతో బలవంతంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయడం సరైంది కాదు.
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపడతామంటూ హామీ ఇచ్చినా అమలు చేయడం లేదు. అయినా పోరాటాలు నిర్వహించడం లేదన్న అభిప్రాయం బలంగా ఉన్నది. దీనిపై ఏమంటారు?
యూఎస్పీసీ, టీఎస్‌యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్నాం. చలో హైదరాబాద్, చలో అసెంబ్లీ వంటి కార్యక్రమాలు చేపట్టాం. అయితే ఉపాద్యాయులు భౌతికంగా పాల్గొనడం లేదు. ఇంకోవైపు కొన్ని సంఘాలు పోరాట మార్గాన్ని ఎంచుకోవడం లేదు. అందుకే పోరాటాలు తగ్గాయన్న అభిప్రాయం ఉపాధ్యాయుల్లో ఉండొచ్చు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు మాకోసం కాదు. పదోన్నతులిస్తే ఖాళీలు ఏర్పడతాయి. వాటిని భర్తీ చేస్తే నిరుద్యోగులకు మేలు కలగడంతోపాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ టీచర్లు, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఉపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి వచ్చారు. పండితులు, పీఈటీలకు మినహా ఉపాధ్యాయ పదోన్నతులకు ఎలాంటి న్యాయ వివాదం లేదు. అయినా వాటిని ఎందుకు చేపట్టడం లేదో అర్థం కావడం లేదు. పదోన్నతులు చేపడితే ఖాళీలు ఏర్పడతాయి కాబట్టి వాటిని భర్తీ చేయడం ప్రభుత్వానికి ఇష్టం లేక ఇలా చేస్తున్నట్టుగా ఉంది. దీంతో ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
నూతన విద్యావిధానంతో మేలు కలుగుతుందంటూ కేంద్రం చెప్తున్నది. మీరేమో వ్యతిరేకిస్తున్నారు. ఎందుకని?
ఒకే దేశం ఒకే విద్యావిధానం పేరుతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎన్ఈపీని తెచ్చింది. మనది ఫెడరల్ వ్యవస్థ. విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నది. అయినా రాష్ట్రాలను సంప్రదించకుండా ఏకపక్షంగా ఎన్ఈపీని కేంద్రం తెచ్చింది. 1968లో కొఠారి కమిషన్ సిఫారసులొచ్చాయి. ఏ ప్రభుత్వం వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. ఆ తర్వాత రాజీవ్‌గాంధీ హయాంలో విద్యావిధానం రూపొందించినా పూర్తిగా అమలు కాలేదు. ఈ రెండింటిపై సమీక్షించకుండానే బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా ఎన్ఈపీని తెచ్చింది. విద్యా కేంద్రీకరణ, వ్యాపారీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణ చేయాలన్నదే లక్ష్యం. పరీక్షల నిర్వహణ పేరుతో కేంద్రం పెత్తనం చెలాయిస్తున్నది. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను తగ్గించి ప్రయివేటు, కార్పొరేట్ వర్సిటీలను ప్రోత్సహిస్తున్నది. అంబానీ, అదానీలు విద్యారంగంలోకి వచ్చి వ్యాపారం చేస్తారు. అందులో భాగమే జియో యూనివర్సిటీ. మెడిసిన్‌ను కూడా హిందీలో చదవాలనడం సరైంది కాదు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తి, సామాజిక న్యాయం, లౌకికత్వం ఎన్ఈపీలో ఎక్కడా లేవు. అందుకే దీన్ని వ్యతిరేకిస్తున్నాం. అయితే ప్రత్యామ్నాయం చూపిస్తున్నాం. శాస్త్రీయ విద్యావిధానాన్ని అమలు చేయాలి.
సీపీఎస్ విధానం రద్దు చేసే అధికారం రాష్ట్రాలకు లేదంటూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల ఏమంటారు?
సీపీఎస్ విధానం రద్దు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్నది. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నపుడు దీన్ని తెచ్చారు. యూపీఏ ప్రభుత్వం పీఎఫ్ఆర్డీఏ చట్టాన్ని చేసింది. ఉమ్మడి ఏపీలో 2004, సెప్టెంబర్ ఒకటి తర్వాత నియామకమైన ఉద్యోగులకు సీపీఎస్ విధానం వర్తిస్తుంది. అయితే వారికి సామాజిక భద్రత లేదు. ఉద్యోగులు, ప్రభుత్వ వాటాను షేర్మార్కెట్లో పెడుతున్నారు. అది ఫైనాన్స్ క్యాపిటల్‌కు ఉపయోగపడుతున్నది. ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనం లేదు. రాజస్థాన్, పంజాబ్, ఛత్తీస్‌ఘడ్, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలు సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని నిర్ణయించాయి. సీపీఎస్‌ను అమలు చేసే హక్కు ఉంది తప్ప వెనక్కి వెళ్లే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదంటూ కేంద్ర ప్రభుత్వం చెప్పడం దుర్మార్గం. రాష్ట్రంలో 1.50 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులున్నారు. రాష్ట్రంలో సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలి. అనుమతించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేంద్రంపై దేశవ్యాప్తంగా పోరాడాలి.
ఈ మహాసభల్లో ఏయే అంశాలు చర్చిస్తారు. భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది?
భవిష్యత్ తరాలకు విద్యను దూరం చేసే ఎన్ఈపీ రద్దు, ఉద్యోగుల సామాజిక భద్రతకు వ్యతిరేకంగా ఉన్న సీపీఎస్ రద్దు కోసం నిర్దిష్టమైన కార్యాచరణను రూపొందిస్తాం. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు, నియామకాల కోసం ఐక్య ఉద్యమాలు నిర్మిస్తాం. 317 జీవో బాధితులకు విశాల ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని న్యాయం చేయాలి. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో టీఎస్‌యూటీఎఫ్‌కు ప్రాతినిధ్యం ఉంది. అందరి సమస్యలపై మహాసభల్లో చర్చించి తీర్మానాలు చేసి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం. సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి నిర్దిష్ట ప్రతిపాదనలతో సమర్పిస్తాం.