Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానివి దుష్ట పన్నాగాలు.. దుర్మార్గపు యత్నాలు
- ఎన్నికలలో పార్టీలు కాదు.. ప్రజలు గెలవాలి
- కమ్యూనిస్టు విప్లవ భావాలతో కూడిన ప్రగతిశీల గడ్డ ఇదీ
- దేశాన్ని రక్షించుకునేందుకు ఖమ్మం నుంచే శంఖారావం
- పనికిమాలిన పాలసీలతో నీటి యుద్ధాలు : బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్
- భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల సమీకృత కార్యాలయాల భవన సముదాయాలు ప్రారంభం
- రెండు జిల్లాలకు ముఖ్యమంత్రి వరాల జల్లు
నవతెలంగాణ - ఖమ్మం, వరంగల్ ప్రాంతీయ ప్రతినిధులు/కొత్తగూడెం/ పాల్వంచ/ మహబూబాబాద్
''ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్రంలోనూ వస్తే ఇక్కడా మత చిచ్చు.. కులాల కుంపట్లు తలెత్తుతాయి. మనం తాలిబాన్ల లెక్క తయారవుతాం.. అశాంతి నెలకొంటుంది. దుష్ట పన్నాగాలు.. దుర్మార్గపుయత్నాలు ఊపందుకుంటాయి..'' అని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆందోళన వ్యక్తం చేశారు. సర్వజనహితంగా పాలన ఉండాలన్నారు.. ఎన్నికల్లో ప్రజల గెలవాలి పార్టీలు కాదని ఉద్బోధించారు. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల సమీకృత కార్యాలయాల భవన సముదాయాలను కేసీఆర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో ఆయన రెండు జిల్లాలకు వరాల జల్లు ప్రకటించారు.
ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కొత్తగూడెం సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ. 'దేశంలోనే అనేక రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా ఉంది' అన్నారు. ఏ రాష్ట్రం ఇవ్వని సీఎంఆర్ఎఫ్ నిధులు ఇచ్చామని తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 33 నూతన జిల్లాలు ఏర్పాటు చెయ్యడంతో పాటు నూతన కలెక్టరేట్ భవనాలు నిర్మించామన్నారు. జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశామని తెలిపారు. కమ్యూనిస్టు విప్లవ భావాలు ఉన్న ఈ గడ్డమీద అద్భుత ప్రగతిశీల కార్యక్రమాలు కొనసాగాలన్నారు. ఉద్యమ సమయాన తనను ఖమ్మం జైల్లో పెట్టినప్పుడు ఇక్కడి ప్రజలు కడుపులో పెట్టుకొని కాపాడుకున్నారని గుర్తు చేశారు. దేశాన్ని రక్షించుకునేందుకు ఖమ్మం నుంచే శంఖారావాన్ని పూరించాలన్నారు. తెలంగాణ రాకముందు 87000 ఉన్న తలసరి ఆదాయం ఇప్పుడు 2.78 లక్షలకు చేరిందన్నారు. 5 లక్షల కోట్లు ఉన్న జీడీపీ వృద్ధి రేటు.. ఇప్పుడు 11 లక్షల కోట్లకు చేరిందన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. కులమత వర్గాలకు కతీతంగా.. సర్వజనహితంగా పాలన సాగిస్తున్నామని చెప్పారు. దేశంలోనే అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామన్నారు. కృష్ణ, గోదావరి జలాలను సద్వినియోగం చేసుకునేందుకు సీతారామ, సీతమ్మ సాగర్ వంటి ప్రాజెక్టులు చేపట్టినట్టు తెలిపారు. కేంద్రం అసమర్థ విధానాలు దుర్మార్గపు పాలన వల్ల 14.50 కోట్లు ఉండాల్సిన తెలంగాణ జీడీపీ వృద్ధిరేటు మూడున్నర లక్షల కోట్లు వెనుకబడిందని వివరించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లయినా నీళ్ల కోసం యుద్ధాలు చేయడమేంటని ప్రశ్నించారు. పనికిమాలిన పాలసీల వల్లే నీటి యుద్ధాలు జరుగుతున్నాయన్నారు. కేంద్రం మంచినీళ్లు, కరెంటు, ఉద్యోగాలు ఇవ్వదు.. ఇంకా ఏమిస్తుందని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలు కానీ, పార్టీలు కాదన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రభుత్వాలను ఎన్నుకోవాలని కోరారు. తెలంగాణ విజ్ఞాన వీచికలు భారతదేశం అంతటా ప్రసారం కావాలన్నారు. సీతారామ, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. సింగరేణి సీఎండితో మాట్లాడి ఇక్కడి జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 481 పంచాయతీలకు గ్రామానికి రూ.10 లక్షల చొప్పున సీఎం ప్రత్యేక నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు.
మత విద్వేషాలపై చర్చ పెట్టాలి
ప్రాజెక్టులు కట్టేదెన్నడు ? సాగునీరు వచ్చేదెన్నడు?
మహబూబాబాద్ సభలో సీఎం కేసీఆర్
మత విద్వేషాలపై ఈరోజు సాయంత్రమే మీ గ్రామంలో చర్చ పెట్టాలని మహబూబాబాద్ సభలో ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. దేశం చెడిపోవద్దనే ఈ మాటలు చెబుతున్నానన్నారు. కేంద్రంలో అభివృద్ధి కాముక, పక్షపాత వైఖరి లేని ప్రభుత్వముంటేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం వైఫల్యం వల్ల తెలంగాణ రాష్ట్రం రూ.3 లక్షల కోట్లను నష్టపోయిందని సీఎం విమర్శించారు. కృష్ణ ట్రిబ్యునల్ తీర్పుకే 20 ఏండ్లు పడితే మనం ప్రాజెక్టులకు అనుమతులు తీసుకునేదెన్నడు ? ప్రాజెక్టులు కట్టేదెన్నడు ? సాగునీరు వచ్చేదెన్నడు ? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. కావేరీ నది జలాలపై తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మధ్య ఘర్షణ వుందన్నారు. రావి, బిలాస్ నది జలాల పంపకాలపై రాజస్థాన్, హర్యాన, పంజాబ్ రాష్ట్రాల మధ్య వివాదాలున్నాయన్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ మున్సిపాల్టీలకు రూ.25 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. మహబూబాబాద్‌కు ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీని మంజూరు చేస్తున్నామని ప్రకటించారు.'మీ పాలనలో మమ్మల్ని భాగస్వాములను చేసినందుకు సీఎంకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని' మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రూ.505 కోట్లను మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీల నిర్మాణానికి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. వెనుకబడిన మహబూబాబాద్ ప్రాంతాన్ని జిల్లాగా చేసి అభివృద్ధిలో ముందుకు నిలిపినందుకు సీఎంకు జిల్లా రుణపడి వుంటుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్లు, మేయర్లు, జెడ్పీ చైర్మెన్లు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.