Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ పర్యటన రద్దుపై గుసగుసలు
- 18న ఖమ్మంలో సీఎం సభతోనే వెనకడుగంటూ ప్రచారం
- అందులో పాల్గొననున్న ఐదుగురు సీఎంలు, ఇద్దరు మాజీ సీఎంలు!
- అందరి చూపూ బీఆర్ఎస్ సభవైపే..బీజేపీ వెనుకడుగు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈనెల 19న రాష్ట్రానికి రాబోతున్నారని బీజేపీ రాష్ట్ర నాయకత్వం తెగ హడావిడి చేసింది. వందేభారత్ రైలును ప్రారంభించడంతోపాటు సికింద్రాబాద్ పెరేడ్‌గ్రౌండ్‌లో పెద్ద బహిరంగ సభ నిర్వహించేందుకు ఆ పార్టీ వ్యూహాలు రచించింది. ఆయన చేతుల మీదుగా నాయకగణం గ్రౌండ్నూ పరిశీలించింది. ఇంతలోనే ప్రధాని పర్యటన రద్దయినట్టు ప్రకటన వెలువడింది. దీనికి ఖమ్మంలో బీఆర్ఎస్ 18వ తేదీన తలపెట్టిన బహిరంగ సభనే కారణమనే చర్చా నడుస్తున్నది. ఆ సభకు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తమిళనాడు సీఎం స్టాలిన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ హాజరుకానున్నట్టు ప్రచారం జరుగుతున్నది. రాష్ట్రాల హక్కులను హరించే విషయంలోనూ, బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడటంలోనూ విభిన్న పార్టీలకు చెందిన ఐదుగురు సీఎంలతో పాటు పలు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు హాజరుకానుండటంతో కచ్చితంగా ప్రభావం ఉంటుందనే భావనతోనే బీజేపీ తన సభను వాయిదా వేసుకున్నట్టు తెలిసింది. ఖమ్మంలో ఎట్లాగూ వామపక్షాల బలంతో ఆ సభ విజయవంతమై.. సికింద్రాబాద్‌లో 19న జరిగే బహిరంగ సభకు జనం పెద్దగా రాకపోతే తెలంగాణలో బలపడటం ఏమోగానీ మెత్తానికే ఎసరొస్తుందనే భయంతోనే ప్రధాని పర్యటనను వాయిదా వేయించారనే గుసగుసలు కూడా వినిపిస్తు న్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఆ పార్టీని హైలెట్ కాకుండా చేయడంలో టీఆర్ఎస్ పార్టీ విజయవంతమైంది. గులాబీ పార్టీ తరఫున కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న విధానాలపై హోర్డింగ్‌లు పెట్టడం, హ్యాష్‌ట్యాగ్‌లు చేయడం చర్చనీయాంశమైంది. ఇప్పుడూ అలాగే జరిగే అవకాశం ఉందని బీజేపీ భావించింది. వాస్తవానికి 19న జరిగే బహిరంగ సభలో మాజీ ఎంపీ పొంగులేటి బీజేపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది. అలర్ట్ అయిన బీఆర్ఎస్..ఆయన పోవడం వల్ల జరిగే నష్టాన్ని వీలైనంతమేరకు తక్కువ చేసే చర్యలకు పూనుకున్నది. అందులో భాగంగానే హరీశ్‌రావు, ఇతర ముఖ్యనేతలను రంగంలోకి దింపింది. 18న ఖమ్మంలో ఏకంగా బీఆర్ఎస్ ఆవిర్భావ సభనే పెట్టింది. లక్షలాది మందిని తరలించే ఏర్పాట్లలోనూ మునిగిపోయింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సభ సక్సెస్ అయ్యి మోడీ సభకు జనం అంతగా రాకపోతే పార్టీకి నష్టమని బీజేపీ భావించింది. సభ వాయిదాకు ఆర్ఎస్ఎస్ ఆదేశాలు కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. క్షేత్రస్థాయిలో బలపడ కుండా బహిరంగ సభలు పెట్టడం వల్ల ఉపయోగముం డదని హెచ్చరించినట్టు తెలిసింది. ముందు బూత్‌స్థాయి నుంచి బీజేపీని బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. అందులో భాగంగానే ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునిల్ బన్సల్ హైదరాబాద్‌లోనే పాగా లోక్‌సభ నియోజకవర్గ ప్రభారీలు, కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లు, జిల్లా అధ్యక్షులతో భేటీ అయ్యారు. రాబోయే రెండు నెలల్లో గ్రామాల్లోకి వ్యూహాత్మకంగా ఎలా వెళ్లాలనే విషయంపై దిశానిర్దేశం చేశారు. ఇంకోవైపు బిజీ షెడ్యూల్ వల్లనే ప్రధాని పర్యటన రద్దయిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద లోగుట్టు పెరుమాండ్లకే ఎరుక.