Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మతంలేదు, కులంలేదు కార్మికులందరిదీ ఒకే సమస్య
- రవాణా కార్మికుల ఇండ్లల్లోనే బస, భోజనం, టిఫిన్
- రోడ్డు మీదే కాదు.. వారి ఇండ్ల్లల్లోనూ దుర్భర పరిస్థితులే
- 24 జిల్లాలు..49 పట్టణాలు.. 2,780 కిలో మీటర్ల సంఘర్ష యాత్ర
- నవతెలంగాణకు సంఘర్ష యాత్ర అనుభవాలను వెల్లడించిన.. ఆల్ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ)
రాష్ట్ర అధ్యక్షులు ఎస్.వీరయ్య
రవాణా రంగ కార్మికులకు కులంలేదు. మతంలేదు. ప్రాంతమూలేదు. కార్మికులందరిదీ ఒకే సమస్య. ప్రభుత్వ, ప్రయివేట్ రవాణా రంగంలో ఆటో, జీపు, కారు, ట్రాలీ, టాక్సీ, బస్సు, లారీ, డీసీఎం ఇలా వస్తువులు, మనుషుల్ని చేరవేసే వాహన డ్రైవర్లు దుర్భర జీవితాలు అనుభవిస్తున్నారు. రోడ్డు మీది కష్టాలే కాదు ఇంట్లోకెళ్లి పరిశీలిస్తే కడు పేదరికం, ఉన్నంతలో సర్దుపోయే కుటుంబాల పరిస్థితి కడుదయనీయం. రోజంతా పనిచేస్తే వచ్చే ఆదాయం పిల్లల ఫీజులు, వైద్య ఖర్చులు, ఇంటి అద్దెలు, పెనాల్టీలు, చలాన్స్, టోల్ ఫీజులకే సరిపోతుంది. పైగా మోటార్ వాహన చట్టం-2019 వచ్చాక జీవనోపాధి ప్రశ్నార్థకమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఆర్టీడబ్యూఎఫ్) తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 20 లక్షల మంది రవాణా రంగ కార్మికుల్ని ఐక్యం చేయాలనే లక్ష్యంతో చేపట్టిన రవాణా రంగ కార్మికుల సంఘర్ష యాత్ర అనుభవాలను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్.వీరయ్య నవతెలంగాణ
మెదక్ ప్రాంతీయ ప్రతినిధితో పంచుకున్నారు.
రవాణా రంగ కార్మికుల్ని సంఘటితం చేయడంతో పాటు మూడు ప్రధాన ఆంశాలపై సంఘర్ష యాత్ర చేపట్టాం. రవాణా రంగ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఆర్టీసీని బలోపేతం చేయడం, మోటార్ వాహన చట్టం 2019ని సవరించడమనే మూడు కీలకాంశాలున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల రవాణా రంగ కార్మికులు వీధిన పడుతున్నారు. వీరందరినీ ఐక్యం చేసి సమస్యలపై దేశవ్యాప్తంగా ఉద్యమం నిర్మించే క్రమంలోనే రాష్ట్రంలో సంఘర్ష యాత్ర చేపట్టాం.
సంఘర్ష యాత్ర ఎక్కడెక్కడ జరిగింది?
రవాణా కార్మికుల సంఘర్ష యాత్రలో నాతో పాటు ఎఐఆర్టీడబ్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్, ఎస్‌డబ్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్‌రావు, సీఐటీయూ రాష్ట్ర నాయకులు కూరపాటి రమేష్‌తో పాటు ఆయా జిల్లాల్లో స్థానిక నాయకత్వం పాల్గొంది.
ఈ నెల 3న ఖమ్మం జిల్లాలో ప్రారంభమైన యాత్ర 11న సంగారెడ్డి పట్టణంలో ముగిసింది. 9 రోజుల పాటు 24 జిల్లాల్లో యాత్ర సాగింది. ఈ సందర్భంగా 49 పట్టణాల్లో వందలాది కార్మికుల అడ్డాల్లో పర్యటిస్తూ 2780 కిలో మీటర్లు యాత్ర సాగింది.
యాత్రలో ఏయే కార్మికుల్ని కలిశారు. వారి సమస్యలేమిటీ?
యాత్ర సందర్భంగా రవాణా రంగంలో ఉన్న ఆటో, ట్రాలీ, డీసీఎం, కారు, జీపు, టాక్సీ, ప్రయివేట్ బస్సులు, ఆర్టీసీ అద్దె బస్సులు, స్కూల్, కళాశాల బస్సుల వంటి వివిధ రకాల వాహన కార్మికుల్ని కలిశాం. యాత్ర ద్వారా వారిని స్వయంగా కలిసి సమస్యల్ని అడిగి తెలుసుకున్నాం. వారిని అడ్డాల్లో కలుసుకోవడమే కాకుండా వారింట్లో బస చేశాం. మొత్తం రవాణా రంగం కార్మికుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందనేది యాత్ర ద్వారా అర్ధమైంది. పిల్లల చదువుల కోసం ఫీజులు కట్టడం, వైద్యం ఖర్చులు, ఇంటి అద్దెలు, పెరిగిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరల భారాలు, రోడ్లపై పెనాల్టీలు, చలాన్స్, టోల్ ఫీజుల వంటి ఖర్చులతో రవాణా కార్మికుల జీవన పరిస్థితులు అధ్వాన్నంగా మారాయి. వీరి సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించడంలేదు. అందుకే కార్మికులు సంక్షేమ బోర్డు, పెనాల్టీలు, చలాన్లు, అడ్డాల సమస్యలపై పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
యాత్ర బృందానికి ఎలాంటి అనుభవాలు వచ్చాయి
సంఘర్ష యాత్ర సాగిన పలు ప్రాంతాల్లో వివిధ రకాల రవాణా కార్మికుల ఇండ్లకు వెళ్లే అవకాశం వచ్చింది. యాత్ర బృందం వెళ్లిన సందర్భంలో రవాణా కార్మికుల కుటుంబాలు చూపిన ఆప్యాయత ఎంతో తృప్తినిచ్చింది. వారిండ్లల్లోనే భోజనం, టిఫిన్ తిన్నాం. ఈ తమకు ఉన్నా లేకున్నా ఇంటికి వచ్చే అథితులకు పెట్టాలనే తాపత్య్రం కనిపించింది. ఎక్కువ మందికి సొంత ఇండ్లు లేవనేది గుర్తించాం. మేం కలిసిన వాళ్లల్లో హిందువులు, క్రిష్టియన్లు, ముస్లీంలున్నారు. వాళ్లల్లో కులం, మతం అనే భావన ఎక్కడా కనిపించలేదు. భద్రాచలంలో ఓ కిరాయి ఇంట్లో ఉంటున్న కారు డ్రైవర్ గోపి కిరాణం షాప్ పెట్టి నష్టపోయి కారు నడుపుతున్నాడు. వైశ్యుడైన గోపి శవపేటికల్ని కూడా నడుపుతూ పేదలకు ఉచితంగా, డబ్బున్న వాళ్లకు కిరాయికిస్తున్నాడు. రాంరెడ్డి అనే ఆటో డ్రైవర్ ఇంట్లో టిఫిన్ చేశాం. మెదక్‌లో సౌకత్ అలీది పెద్ద కుటుంబం. వాళ్లుండే ఇల్లు పేదదే కానీ.. వారి మనసు ఎంతో గొప్పది. ఆర్టీసీ డ్రైవర్ బాబు క్రిష్టియన్ అతని ఇంటికీ వెళ్లాం. మిధాని వద్ద పుట్‌పాత్ మీద గుడిసెలో ఉండే గిరిజన కార్మికుడి ఇంటికెళ్లాం. అంబేద్కర్‌నగర్ చెత్త బండితోలే కార్మికుడి ఇంట్లోనూ తిన్నాం. ఇలా యాత్రలో అనేక ప్రాంతాలు, కులాలు, మతాలకు చెందిన రవాణా కార్మికుల ఇండ్లల్లో తినడం, బస చేయడం ద్వారా వారి కుటుంబ స్థితిగతులు అర్ధం చేసుకోగలిగాం. వారందరిలోనూ మతం, కులం అనే భావన కనిపించలేదు. తామంతా కార్మికులమనే చాటారు.
యాత్రకు కలిసొచ్చిన యూనియన్లు ఏవీ
అన్ని జిల్లాల్లోనూ యాత్రకు ఇతర యూనియన్లు ఘనంగా స్వాగతం పలికాయి. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ వంటి పెద్ద సంఘాలు మాకు స్వాగతం పలికాయి. ఆర్టీసీలో మజ్దూర్ యూనియన్ నాయకులు సైతం యాత్ర బృందాన్ని కలిశారు. వేతన ఒప్పందాలు అమలు గురించి మేం ఏమీ చేయలేకపోతున్నామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఐక్య పోరాటాల్లో కలిసొస్తామన్నారు. చాలా చోట్ల జైశ్రీరాం ఆటో యూనియన్, జాంబవ ఆటో యూనియన్, లక్ష్మీనరసింహ ఆటో యూనియన్ పేర్లతో ఉన్న కార్మికులు మాకు ఘనంగా స్వాగతం పలికారు. ఆ యూనియన్లలో ముస్లీంలు, హిందువులు, క్రిష్టియన్లు కూడా నాయకులుగా ఉన్నారు. వారెవరిలోనూ మత, కుల బేధాలు కలిపించలేదు. మహబూబ్‌నగర్ జిల్లాలో కందూరు గ్రామంలో 400 మంది లారీ డ్రైవర్లున్నారు. అంతా ఒకే ఊరిలో ఉన్నా సమస్యలపై ఒక్కటిగా లేరు. వారిండ్లల్లోనూ టిఫిన్ చేశాం. సీఐటీయూ ఆధ్వర్యంలో సమస్యలపై ఐక్యంగా పోరాడుదామని చెప్పాం.
మోటార్ వాహన చట్టం 2019 రద్దు కోసం ఏం చేయబోతున్నారు
మోడీ తెచ్చిన మోటార్ వాహన చట్టం 2019 పక్కా కార్పొరేట్లకు లాభం చేకూర్చేది. ఆ చట్టం వల్ల రవాణా రంగంలోని కార్మికులందరికీ ఉపాధి లేకుండా పోతుంది. ఆ చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్‌తో దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టబోతున్నాం. అందుకే రాష్ట్రంలో సంఘర్ష యాత్ర చేశాం. ఇలాంటి యాత్రలో దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ జరుగుతున్నాయి. రాబోయే కాలంలో రవాణా రంగంలోని కార్మికులు సంఘటితంగా కదిలి దేశవ్యాప్తంగా సమరశీలంగా ఉద్యమించనున్నారు.