Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పార్ట్-2
- ఎక్కడ వేసిన గొంగడి అక్కడే
- దీర్ఘకాలికంగా పెండింగ్‌లో సమస్యలు
- అపెక్స్ బోర్డూ ఉత్తదే
- రాష్ట్రానికి పెరిగిన అప్పులు
బి. బసవపున్నయ్య
రాష్ట్రంలో సాగునీటి వివాదాలు ఏండ్ల తరబడి కొనసాగుతున్నాయి. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉంటు న్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత లేకపోవడం, కేంద్రం చోద్యం చూస్తుండటంతో ఎక్కవ వేసిన గొంగడి అక్కడేలా పరిస్థితి తయారైంది. చివరకూ రెండు రాష్ట్రాల సీఎంలు, సీఈలతో అపెక్స్ బోర్డు ఏర్పాటు చేసినా సమస్యలు కొలిక్కి కాలేదు. కాగా రాష్ట్రానికి అప్పులు మాత్రం భారీగానే పెరిగాయి. ట్రిబ్యునల్‌తో లాభం లేదంటూ ఏపీ, తెలంగాణ ప్రాజెక్టులను కేంద్రం తన ఆధీనంలోకి తీసుకుంటూ జులై 15, 2021న గెజిట్ విడుదల చేసిన విషయం విదితమే. ఈ చట్టం జులై 2, 2014 నుంచి అమల్లోకి వస్తుందని ఆ గెజిట్లోనే పేర్కొంది. దీని ప్రకారం ప్రాజెక్టులకు కేంద్రం మూడు భాగాలు చేసింది. నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్టులకు కేంద్రం ఆధీనంలో ఉంటాయి. నిర్మాణం జరిగిన అనుమతులు లేకుండా ఉన్నవాటికి ఏడాదిలో అనుమతులు తీసుకోవాలి. అలాగే రాష్ట్రాల ఆధీనంలో పాత ప్రాజెక్టులు ఉన్నాయి. అయినా కేంద్రం పెత్తనమే ఉంటుందని గెజిట్‌లో చెప్పారు. దీంతో భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు కేంద్రం పరిధిలోకి వెళ్లాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని ఆయా ప్రాజెక్టుల పనులు కేంద్రం ఆపేసింది. దీనికితోడు ఇప్పటికే అమల్లో ఉన్న బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ కూడా తన విచారణను నిలిపేసింది. ఆ విధంగా ప్రాజెక్టుల పనులు, ట్రిబ్యునల్ విచారణ అన్ని స్థంబించిపోయాయి. తెలంగాణకు సంబంధించి నాగార్జునసాగర్‌తోపాటు 36 ప్రాజెక్టులు కేఆర్ఎంబీ పరిధిలో ఉండగా, జీఆర్ఎంబీ బోర్డులో తెలంగాణకు సంబంధించి 16 ప్రాజెక్టులు ఉన్నాయి. కీలకమైన ప్రాజెక్టులన్నీ కేంద్రం పరిధిలోకి వెళ్లాయి. నిర్వహణ కోసం రెండు రాష్ట్రాలు ప్రతియేటా రూ.200 కోట్ల చొప్పున పరిపాలనా ఖర్చుల కింద కేటాయించాలని ఆదేశించింది. ఇతర రాష్ట్రాల ఇంజినీర్లను సైతం నియమించి నిర్వహణ చేపడుతున్నది. గెజిట్ ప్రకారం కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ పరిధిలోని ప్రాజెక్టులను 2022, అక్టోబర్ నాటికి అప్పగించాలని కోరినా ఏ రాష్ట్రమూ స్పందించలేదు. 70 నుంచి 80 శాతం పూర్తయిన ప్రాజెక్టులైన శ్రీరామసాగర్ రెండో దశ, శ్రీరామసాగర్ వరదకాలువ, నాగార్జున సాగర్ వరదకాలువ, నాగార్జున్‌సాగర్ ఎస్ఎల్బీసీ, ఎఎంఆర్ ప్రాజెక్టులతోపాటు అదిలాబాద్ జిల్లాలో మరో 15 మధ్యతరహా ప్రాజెక్టుల పనులు ఆగిపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కన్నేపల్లి దగ్గరి బాహుబలి మోటార్ల పంపులు మునిగిపోయిన విషయం విదితమే. ఇప్పటివరకు కొన్ని మరమ్మత్తులు చేశారు. ఈ ఖర్చులు ఎవరు భరిస్తున్నారనేది ప్రభుత్వం ఇప్పటికీ చెప్పడం లేదు. గత రెండేండ్లుగా పడుతున్న వర్షాలతో 42 లక్షల నుంచి 64 లక్షల ఎకరాల వరకు 'వరి' పంట సాగవుతున్నదని అధికారిక సమాచారం.
అప్పులు..వడ్డీలు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఎప్పటికప్పుడు సర్కారులో సమాలోచనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రం అప్పు 2023 , మార్చినాటికి రూ.3.30 లక్షల కోట్లకు చేరుతుందని బడ్జెట్లో చూపించారు. వాస్తవంగా బడ్జేతర అప్పులతో కలిసి మొత్తం అప్పు రూ. 4 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దీనికి వడ్డీ రూ. 27 వేల కోట్లు చెల్లిస్తున్నట్టు బడ్జెట్ నివేదికలు చెబుతున్నాయి. ఇందులో 50 శాతం మేర సాగునీటి ప్రాజెక్టుల వడ్డీలే కావడం గమనార్హం.
ఇప్పుడెలా ..?
బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులు తగ్గించడమేగాక కేటాయించిన నిధులను సైతం సకాలంలో ఇవ్వడం లేదు. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నది. దీంతో కేసీఆర్ సర్కారు మల్లగుల్లాలు పడుతున్నది. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను కొనసాగించాల్సిన అవసరం ఉంది. పలు పథకాలకు జాతీయ హోదా ఇవ్వాలని అడిగింది. అయినా మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదు. అలాగే యాక్సీలరేటేడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రొగ్రామ్(ఏఐబీపీ) పథకం వచ్చే నిధులకూ కోత పెట్టింది. గతంలో ఈ పథకానికి రూ. నాలుగు వేల కోట్లకుపైగా వచ్చేవి. ఇప్పుడు వాటిని రూ. రెండు వేల కోట్లకు కుదించింది. 2023 బడ్జెట్లో మొత్తం కోతపెట్టారు. ఏఐబీపీ పథకం కూడా యూపీఏ సర్కారు చేపట్టిందే కావడం గమనార్హం. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం సర్కారుకు సవాల్ కానుంది. మళ్లీ అప్పులు తెచ్చుకోకతప్పదని ఆర్ధిక శాఖ అధికారులే అంటున్నారు.
నిధులేలా... ?
ప్రభుత్వం సాధారణంగా అప్పులు చేయాలంటే ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం వ్యవహారం నడపాల్సిందే. సాధారణంగా ఎఫ్ఆర్బీఎం 3.5 శాతం ఉండగా, నాలుగు శాతానికి పెంచారు. రాష్ట్ర ప్రభుత్వం 4.5 శాతానికి పెంచాలని కోరుతున్నా, కేంద్రం నిరాకరిస్తున్నది. అంతే గాక ఇతర ఆర్థిక సంస్థల నుంచి, అంతర్జాతీయ సంస్థల నుంచి అప్పులు తెచ్చుకోకుండా అడ్డంపడుతున్నది. ఆ నిబంధనలకు మించి అప్పులు చేస్తే కేంద్రం అంగీకరించదు. వాణిజ్య బ్యాంకులు, ఆర్బీఐ, ఆర్థిక బాండ్ల విడుదల ద్వారా ఇప్పటిదాకా సేకరిస్తున్నది. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, సీతారామసాగర్ ప్రాజెక్టులకు ఇప్పటికే అప్పులు చేసింది.వేల కోట్లు ఖర్చుపెట్టింది. వాటికి వడ్డీలు చెల్లిస్తూనే ఉన్నది. కాగా నిధులు అవసరమైతే మళ్లీ బ్యాంకుల నుంచే అప్పులు తేవాలా ? నాబార్డు ఇతర ఆర్థిక సంస్థలను సంప్రదించాలా ? అనే విషయంలో సాగునీటిపారుదల, ఆయకట్టు శాఖలో చర్చ నడుస్తున్నది. బీజేపీ పాలితరాష్ట్రాలకు బాగా నిధులిస్తూ, ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలకు సహకరించడం లేదు.
1.50 లక్షల కోట్లు అవసరం
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయడానికి భారీగా నిధులు అవసరమని ఇటు సాగునీటి శాఖ ఉన్నతాధికారులు, అటు సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు. వాటికి దాదాపు రూ. 1.50 లక్షల కోట్లు కావాల్సి ఉంటుందనీ, అప్పుడే చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయి సత్ఫలితాలు వస్తాయని అంటున్నారు.
వచ్చే రెండేండ్లల్లో పూర్తికాకపోతే..
ఈ ప్రాజెక్టులు వచ్చే రెండేండ్లల్లో పూర్తిచేయకపోతే ప్రభుత్వంపై మరింత ఆర్థిక భారం ప్రభుత్వం పడే అవకాశాలు ఉన్నాయని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు. నిధులు విడుదల చేసి సకాలంలో పనులు ముగించకపోతే అంచనా వ్యయాలు మరింత పెరిగే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ఎస్ఎస్ఆర్ రేట్లూ పెరుగుతాయి.రీడిజైన్లు చేయడం సైతం వ్యయం పెరగడానికి కారణమవుతున్నది. గతంలో ఒక్కో ప్రాజెక్టు పూర్తికావడానికి 15 నుంచి 20 ఏండ్లు పట్టేది. దాంతో నిధుల అంచనాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం పెంచాల్సి వచ్చింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టును రూ.155 కోట్లతో చేపట్టారు. నిర్మాణం ఆలస్యమై ఎస్ఎస్ఆర్ రేట్లు అంచనా వ్యయమూ అధికమైంది. దీంతో ఆ ప్రాజెక్టు పూర్తయ్యేనాటికి రూ. 3500 కోట్లు ఖర్చయ్యాయి. నాగార్జునసాగర్‌తోపాటు శ్రీరామసాగర్ 1964లో రూ.40 కోట్లతో ప్రారంభించగా, మొత్తం ప్రాజెక్టు పనులు ముగిసేనాటికి రూ.2850 కోట్లకు మొదటి దశ చేరుకుంది. రెండో దశ ఇంకా కొనసాగుతూనే ఉంది. కాళేశ్వరం, భక్తరామదాసు ప్రాజెక్టు రికార్డుస్థాయిలో మూడేండ్లల్లో పూర్తిచేయగలిగింది. పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) ప్రకారం వేగంగా పనులు పూర్తిచేస్తేనే ఆర్థిక కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉన్నట్టు సమాచారం.