Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట అఖిలపక్షం ధర్నా
- భారీగా తరలివచ్చిన రైతులు
నవతెలంగాణ- ఆదిలాబాద్ అర్బన్
క్వింటాల్ పత్తికి రూ.10వేలు చెల్లించాలని అఖిలపక్ష పార్టీల నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ప్రయివేటు కంటే అధికంగా ధర నిర్ణయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. పంటలకు మార్కెట్లో గిట్టుబాటు ధర చెల్లించాలని, పత్తి క్వింటాల్‌కు రూ.10వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం తెలంగాణ రాష్ట్ర రైతు ఐక్య కార్యాచరణ కమిటి(జేఏసీ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. స్థానిక రోడ్లు భవనాల శాఖ విశ్రాంతి భవనం నుంచి కలెక్టరేట్‌కు ర్యాలీగా వచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ(ఎం), సీపీఐ, బీఎస్పీ, వివిధ ప్రజా సంఘాల నాయకులు ఈ నిరసనలో పాల్గొన్నారు. అఖిలపక్షం పిలుపు మేరకు రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షుడు దారట్ల కిష్టు మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో సాగు పెట్టుబడి పెరిగినా ఇందుకనుగుణంగా పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని తెలిపారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు కేంద్రం శాస్త్రీయ పద్ధతిలో మద్ధతు ధరలు నిర్ణయించకుండా అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్లో రైతులకు గిట్టుబాటు ధర లభించకపోగా.. ఉన్న ధర కూడా దిగిపోవడం ఆందోళనకరమన్నారు. సీసీఐ ప్రయివేటు వ్యాపారులతో పోటీపడి పత్తిని కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ధర తక్కువగా ఉండటంతో ప్రస్తుతం 80శాతం మంది రైతులు ఇండ్లలోనే పత్తిని నిల్వ చేసుకున్నారని తెలిపారు. ప్రయివేటుతో పోటీపడి సీసీఐ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. డీసీసీబీ చైర్మెన్ అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ.. ఈ పోరాటాన్ని గ్రామీణ స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. కేంద్రం వెంటనే స్పందించి సీసీఐని రంగంలోకి దింపాలని, క్వింటాల్‌కు రూ.10వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ.. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో బీజేపీ పెట్టిందని తెలిపారు. ఆ తర్వాత ఎన్నికల హామీని విస్మరిస్తోందని విమర్శించారు. పత్తి ధర పెంపు కోసం బీజేపీ నాయకులను గ్రామగ్రామాన నిలదీయాలని పిలుపునిచ్చారు. అనంతరం అదనపు కలెక్టర్ నటరాజ్‌కు వినతిపత్రం అందించారు.
ఈ కార్యక్రమంలో అఖిలపక్ష రైతు సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు బండి దత్తాత్రి, కొండ రమేష్, విజ్జగిరి నారాయణ, మార్శెట్టి గోవర్దన్, చిలుక దేవిదాస్, సామ రూపేష్‌రెడ్డి, లోకారి పోశెట్టి, కేమ లక్ష్మణ్, గోవర్దన్‌యాదవ్, నల్ల గణపతిరెడ్డి, జగన్, సురేందర్‌రెడ్డి, సంగెపు బొర్రన్న పాల్గొన్నారు.