Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూలూరు గౌరీశంకర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
''మరణం నా చివరి చరణం కాదు - సమరమే నా అంతిమ చిరునామా'' అన్న అలిశెట్టి కవిత్వ పంక్తులు ఇప్పటికీ, ఎప్పటికీ జన హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తాయని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరు గౌరీశంకర్ వ్యాఖ్యానించారు. గురువారం సాహిత్య అకాడమీ కార్యాలయంలో 'అలిశెట్టి ప్రభాకర్ జయంతి/వర్ధంతి' సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జూలూరు మాట్లాడుతూ సమాజం మారాలనీ, అందరూ సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో సామాజిక తాత్వికతతో అలిశెట్టి ప్రభాకర్ రాసిన కవితలు తెలుగునాట రుద్రవీణలుగా జనం గుండెల్లో మారుమో గాయని తెలిపారు. అక్షరాన్ని ఆయుధంగా చేసి దోపిడీ వ్యవస్థపై కవితా యుద్ధం చేసిన కలం యోధుడుగా ఆయన నిలిచారన్నారు. 'తెలంగాణ తేజో మూర్తుల జీవిత చరిత్రలు, వారి రచనలను నేటి తరానికి తెలియజేసినప్పుడే మన సాహిత్య, సాంస్కృతిక సౌరభాలు వర్ధిల్లుతాయని' గౌరీశంకర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో తెలం గాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు ఆచార్యులు డాక్టర్ యస్. రఘు, కాళోజీ అవార్డు గ్రహీత కోట్ల వెంకటేశ్వర్‌రెడ్డి, సాహిత్య విమర్శకులు కెపి.అశోక్ కుమార్, అమెరికాలో ఉన్న తెలంగాణ రచయిత వేణుగోపాల్ నక్షత్రము, తదితరులు పాల్గొన్నారు.