Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాలనీలు.. బస్తీలలో గస్తీని పెంచండి
- అన్ని జిల్లాల ఎస్పీలు, నగర సీపీ లకు డీజీపీ ఆదేశం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : సంక్రాంతి సెలవులు పురస్కరించుకొని భారీ సంఖ్యలో ప్రజలు తమ ఊర్లకు వెళ్తున్న నేపథ్యంలో దొంగతనాలు జరిగే ప్రమాదమున్నదనీ, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలని డీజీపీ అంజనీ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లకు డీజీపీ కార్యాలయం నుంచి అంతర్గత ఆదేశాలు అందాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లు మొదలుకొని వివిధ పట్టణ ప్రాంతాల నుంచి సంక్రాంతి సెలవుల్లో గడపడానికి అనేక మంది ప్రజలు వారి సొంత గ్రామాలకు తరలుతున్నారని ఆయన తెలిపారు. ముఖ్యంగా, దాదాపు వారం రోజుల పాటు ప్రజలు ఊర్లకు తరలుతున్న నేపథ్యంలో వారి ఇండ్లకు తాళాలు వేసి ఉంటాయనీ, దీనిని దొంగలు ఆసరాగా చేసుకొనే అవకాశం ఉన్నదని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా, దూరంగా విసిరేసినట్టుండే కాలనీలు బస్తీలలో చోరీలు జరిగే అవకాశాలున్నాయని తెలిపారు. ఈ కారణంతో కాలనీలు, బస్తీలలో రాత్రి వేళే కాకుండా పగటి పూట కూడా పోలీసు గస్తీని పెంచాలనీ, సోదాలను ముమ్మరం చేయాలనీ, రాత్రివేళ అనుమానితులపై కన్నేసి ఉంచాలని ఆయన సూచించారు. ఈ విషయంలో జిల్లాల ఎస్పీలు, నగర కమిషనర్లు కింది స్థాయి అధికారులకు ఎప్పటికప్పుడు తగిన సూచనలు చేయాలని ఆయన కోరారు.