Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ప్రారంభోత్సవం సందర్భంగా బుధవారం అర్ధరాత్రి నుంచే విద్యార్థి సంఘాల నాయకుల ఇండ్లకు వెళ్లి అక్రమంగా పోలీసులు అరెస్టు చేయడాన్ని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. పోలీసులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ విద్యార్ధి నాయకులను ముందస్తు అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల ఎస్ఎఫ్ఐ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని తెలిపారు. బుధవారం అర్ధరాత్రి నుంచే వారి ఇండ్లకు వెళ్లి అరెస్ట్ చేసి ఎక్కడో దూరంగా ఉన్న పోలీసు స్టేషన్లకు తరలించారని పేర్కొన్నారు. నిరంతరం విద్యార్థి సమస్యలపై పోరాడుతున్న నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం వరకే పరిమితం కాకుండా ఆయా జిల్లాల్లో ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ స్కాలర్ షిప్లు, గురుకులాలు, సంక్షేమ హస్టళ్ల విద్యార్థులకు పెరిగిన ధరలకనుగుణంగా మెస్ ఛార్జీలను పెంచాలని కోరారు. ఆయా డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్నా పట్టించుకోని ప్రభుత్వం సీఎం కేసీఆర్ను నిలదీస్తామనే కారణంతో అక్రమంగా అరెస్టులు చేయించిందని తెలిపారు. విద్యార్థి నాయకులను వెంటనే విడుదల చేయాలనీ, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.