Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖమ్మం నుంచి శ్రీకారం
- 18న ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
- జిల్లా కలెక్టర్లు, డీఎంహెచ్వోలతో మంత్రి హరీశ్ రావు సమీక్ష
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కంటి వెలుగు రెండో దశ కార్యక్రమాన్ని ఈ నెల 18న మధ్యాహ్నం ఒంటి గంటకు ఖమ్మంలో సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు గురువారం ఖమ్మం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఎంహెచ్వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రారంభ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ముమ్మరం చేయాలని ఆదేశించారు. శుక్రవారం సాయంత్రానికి కండ్ల పరీక్ష పరికరాలు, కండ్లద్దాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా స్థాయిలో వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసుకోవాలనీ, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ముందుకెళ్లాలనీ, పరీక్ష బృందాలకు అవసరమైన సౌకర్యాలు స్థానికంగా కల్పించాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మహంతికి రిపోర్టు చేయాలని స్పష్టం చేశారు. బృందాలు ఉదయం 9 గంటలకు, సాయంత్రం 4 గంటలకు ఒకసారి వాట్సప్‌లో అప్డేట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించేలా గ్రామాలు, పట్టణాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రజలకు అర్థమయ్యేలా వివరాలతో కూడిన ఫ్లెక్సీలు, బోర్డులు ఎక్కడిక్కడ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్వేర్ ద్వారా స్క్రీనింగ్ నిర్వహణ ఉంటుంది కాబట్టి సాంకేతిక సమస్యలు లేకుండా చూసుకోవాలన్నారు. ఆధార్ తప్పనిసరి అని స్పష్టం చేశారు. వంద రోజుల్లో పూర్తి చేసేందుకు 1,500లకు బృందాలు పని చేస్తాయని తెలిపారు. విడతల వారీగా, 16,533 లొకేషన్స్ (రూరల్ -12,763, అర్బన్ -3,788)లో క్యాంపులు నిర్వహణ చేస్తున్నట్లు చెప్పారు. ప్రాథమికంగా 30 లక్షల రీడింగ్ గ్లాసెస్, 25 లక్షల ప్రిస్కిప్షన్ గ్లాసెస్ అవసరమైన వారికి ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
మండల స్థాయిలో ఎంపీడీవో, ఎమ్మార్వో, మండల స్పెషల్ ఆఫీసర్, ఎంపీవో పర్యవేక్షించాల్సి ఉంటుందనీ, జిల్లా స్థాయిలో డీఎంహెచ్‌వో, డిప్యూటీ డీఎంహెచ్‌వో, ప్రోగ్రాం ఆఫీసర్స్ క్యాంపులను మానిటరింగ్ చేయాలని స్పష్టం చేశారు. క్యాంపుల సందర్శన చేసేలా వీరికి టూర్ షెడ్యూల్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి రోజు క్యాంపుల సందర్శన ఉండేలా చూడాలని సూచించారు. జిల్లా స్థాయిలో అడిషన్ కలెక్టర్ (లోకల్ బాడీస్) పూర్తి పర్యవేక్షణ చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లాలకు చేరే కంటి శిభిర బృందాలతో కలెక్టర్లు ఇంటరాక్ట్ కావాలని, వారికి మార్గనిర్దేశనం చేయాలని మంత్రి సూచించారు. అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యాన్ని సాకారం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి, డీఎంఇ రమేష్ రెడ్డి, డీపీహెచ్ శ్రీనివాస రావు, టీఎస్ఎంఎంస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులు పాల్గొన్నారు.