Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎడమొహం...పెడమొహంగానే సీనియర్లు
- నియోజకవర్గాల వారీగా 26న 'హాత్ సే హాత్' యాత్రకు శ్రీకారం
- శాంతించని కోమటిరెడ్డి...ఏఐసీసీపై అసంతృప్తి
- ఎమ్మెల్యే జగ్గారెడ్డి దూరం
- రెండు రోజులపాటు సమావేశాలతో ఠాక్రే బిజీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే రెండు రోజులపాటు గాంధీభవన్‌లో బిజిబిజిగా గడిపారు. పార్టీ సీనియర్ నేతలతోనూ ఆయన విడివిడిగా సమావేశమయ్యారు. పీఏసీ, కార్యవర్గ కమిటీ, అనుబంధ సంఘాలతో ఉమ్మడిగా భేటీ అయ్యారు. ఎన్నికలతోపాటు భారత్ జోడ్ యాత్ర స్ఫూర్తిగా హాత్ సే హాత్ అభియాన్ యాత్రకు సంసిద్ధం చేశారు. నియోజకవర్గాల వారీగా జనవరి 26 నుంచి యాత్రలు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ఇంచార్జిగా వచ్చిన ఆయనకు...పార్టీ నేతల్లో ఉన్న అంతర్గత విభేదాలు సవాల్‌గా మారాయి. వారిని శాంతింపజేయడం ఆయనకు కత్తిమీద సాములా మారింది. రెండు రోజులపాటు జరగనున్న సమాశాలకు హాజరు కావాలంటూ గాంధీభవన్ నుంచి సమాచారం వెళ్లినప్పటికీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డిగానీ, ఎమ్మెల్యే జగ్గారెడ్డిగానీ హాజరు కాలేదు. వారు పార్టీ ఆదేశాలను సైతం లెక్క చేయలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హస్తం గుర్తుపై గెలిచిన విశ్వాసం కూడా వారికి లేదనే గుసగుసలు వినిపించాయి. కొత్త కార్యవర్గంపైన, రేవంత్‌రెడ్డిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సీనియర్లు మాత్రం ఎట్టకేలకు హాజరయ్యారు. పార్టీ సమావేశాల్లో వారంతా ముభావంగానే ఉన్నారని నేతలు చెబుతున్నారు. పార్టీ అధ్యక్షునితో ఎడమొహం, పెడమొహంగానే ఉన్నారని సమావేశాల్లో పాల్గొన్న నేతలు తెలిపారు. ఇప్పటికే అనేక అటుపోట్లు ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌కు ఇలాంటి పరిస్థితులు ఇబ్బందికరంగా మారుతున్నాయనే ఆవేదన వ్యక్తమవుతున్నది. దీనికారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్‌రెడ్డి పాదయాత్రపై పార్టీ నేతల్లో ఏకాభిప్రాయం రాలేదనే చర్చ కొనసాగుతున్నది. నియోజకవర్గాల వారీగా రెండు నెలలపాటు హాత్ సే హాత్ అభియాన్ యాత్ర చేపట్టాలని ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే చెప్పారు తప్ప రేవంత్ పాదయాత్రపై స్పష్టత ఇవ్వలేదు. దీనికి వెనుక పార్టీ సీనియర్ల ఒత్తిడి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేవంత్ తన పాదయాత్రను భద్రాచలం నుంచి ప్రారంభిస్తారనే ప్రచారం చక్కర్లు కొడుతున్నది. కానీ మాణిక్‌రావు ఠాక్రే దాన్ని ప్రస్తావించలేదనే వాదన వినిబడుతున్నది. 'ఊరంత ఒక్కదారైతే ఉలిపికర్రది మరోదారి' అన్నట్టు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రూటే సపరేట్గా ఉన్నది. ఉత్తమ్‌కుమారెడ్డి అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ కాంగ్రెస్‌కు పంటికింద రాయిలా వ్యవహరించిన ఆయన...రేవంత్‌రెడ్డి విషయంలోనూ అదే వైఖరితో మాట్లాడుతున్నారు. మునుగోడు ఎన్నికలో బీజేపీకి మద్దతు తెలిపిన ఆయన...తనను తాను సమర్థించుకునేలా మాట్లాడుతూ ఏఐసీసీపై దాడి చేస్తున్నారు. తాజాగా 'నాలుగుసార్లు ఓడిపోయిన వారితో నేను కూర్చోవాలా' అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన కమలదళంలో చేరుతారనే చర్చ మొదలైంది. అయితే ఆయనంతట ఆయనే పార్టీ వీడాలనే వైఖరితో రాష్ట్ర నాయకత్వం ఉండగా, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానే పోవాలనే ఉద్దేశంతో వెంకట్‌రెడ్డి ఉన్నట్టు తెలిసింది.