Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు కూనంనేని లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టుల భర్తీలో దేహదారుఢ్య పరీక్షల్లో నూతన నిబంధనలను సవరించాలనీ, పరుగు పందెం ఆధారంగా మెయిన్స్ అవకాశం కల్పించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు గురువారం ఆయన లేఖ రాశారు. పోలీసు నియామకాల నోటిఫికేషన్లో పురుషులకు, మహిళలకు దేహదారుఢ్య పరీక్షల్లో కొన్ని మార్పులు చేస్తూ కొత్త నిబంధనలను తీసుకొచ్చారని తెలిపారు. దాని వల్ల పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ అభ్యర్థులు నష్టపోయారని పేర్కొన్నారు. రన్నింగ్‌కు సంబంధించి పురుషులకు 1,600 మీటర్లు, మహిళలకు 800 మీటర్ల పరుగు పందెంలో ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. లాంగ్‌జంప్ విభాగంలో పురుషులకు 3.80 మీటర్లు, మహిళలకు 2.50 మీటర్లుుంటే వాటిని సవరించి పురుషులకు నాలుగు మీటర్లు, మహిళలకు 2.50 మీటర్లకు పెంచారని వివరించారు. అలాగే షాట్‌పుట్ విభాగంలో గతంలో పురుషులకు 5.60 మీటర్లు, మహిళలకు 3.75 మీటర్లుంటే దానిని పురుషులకు ఆరు మీటర్లకు, మహిళలకు నాలుగు మీటర్లకు పెంచారని పేర్కొన్నారు. ఇలాంటి నిబంధనలు ఆర్మీ నియామకాల్లోనూ లేవని తెలిపారు. గతంలో ఐదు ఈవెంట్లలో ఏవైనా మూడింటిలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫైర్‌మెన్, సివిల్, జైల్ వార్డెన్, ఎక్సైజ్, కమ్యూనికేషన్, డ్రైవర్ లాంటి పరీక్ష ఆధారిత పోస్టులకు ఎంపికయ్యే వారని గుర్తు చేశారు. ఇప్పుడు తీసుకొచ్చిన నోటిఫికేషన్లో ఐదు ఈవెంట్లను మూడుకు కుదించి, ఎలాంటి అప్షన్ లేకుండా వాటన్నింటిలో అర్హత సాధించాలంటూ నిబంధనలు పెట్టారని తెలిపారు. మూడు ఈవెంట్లలో ఏ ఒక్కటి అర్హత సాధించలేకపోయినా 15 రకాల పోస్టులకు అర్హత కోల్పోయారని పేర్కొన్నారు. పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ నియామకాల్లో దేహదారుఢ్య పరీక్షలైన లాంగ్‌జంప్, షార్ట్‌పుట్ విభాగంలో కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలను సవరించాలనీ, ఇప్పటికే పరుగుపందెంలో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు.