Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘనస్వాగతం పలకాలి : నేషనల్ కమిటీ ఫర్ సాలిడారిటీ విత్ క్యూబా నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
క్యూబా పోరాట యోధుడు చేగువేరా కుమార్తె డాక్టర్ అలైదా గువేరా, ఆయన మనవరాలు ప్రొఫెసర్ ఎస్తిఫోనియా గువేరాలు భారత్‌లో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ఈనెల 22న హైదరాబాద్‌కు విచ్చేయనున్న వారికి ఘనంగా స్వాగతం పలకాలని నేషనల్ కమిటీ ఫర్ సాలిడారిటీ విత్ క్యూబా నిర్ణయించింది. అదేరోజు రవీంద్ర భారతిలో నిర్వహించే సభలో వారు పాల్గొంటారని తెలిపింది. హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్లో గురువారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్ బాలమల్లేష్ అధ్యక్షతన నేషనల్ కమిటీ ఫర్ సాలిడారిటీ విత్ క్యూబా సమావేశాన్ని నిర్వహించారు. డిజి నరసింహారావు (సీపీఐ(ఎం), మల్లు రవి (టీపీసీసీ), శ్రీపతి సతీష్, అనంతరెడ్డి (టీడీపీ), కె గోవర్ధన్ (సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, ఎం హన్మేష్ (సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా, జెవి చలపతిరావు (సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, వనం సుధాకర్ (ఎంసీపీఐ(యూ)), ప్రసాద్ (సీపీఐ(ఎంఎల్), రాజేష్ (సీపీఐ (ఎంఎల్) లిబరేషన్), మురహరి (ఎస్‌యూసీఐ(సీ), డాక్టర్ డి సుధాకర్ (ఆప్), కెవిఎల్ (ఐప్సో), కె శివాజి, ఆర్ గోవింద్ (ఆరెస్పీ), ఎం శ్రీనివాస్ (ఐఎఫ్టీయూ) పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న క్యూబాకు సంఘీభావం తెలపాలని నిర్ణయించామన్నారు. అలైదా గువేరా, ఎస్తిఫోనియా గువేరా ఈనెల 22న ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారని తెలిపారు. అదేరోజు సాయంత్రం నాలుగు గంటలకు రవీంద్రభారతిలో నిర్వహించే సభలో వారు పాల్గొంటారని వివరించారు. అమెరికా సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా, క్యూబా విముక్తి కోసం చేగువేరా పోరాటం చేశారని గుర్తు చేశారు. కరోనాతో ప్రపంప దేశాలు తల్లడిల్లుతున్న తరుణంలో 69 దేశాలకు క్యూబా వైద్య సహాయం అందించిందని చెప్పారు. వైద్యులు, ఔషధాలను పంపిందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా క్యూబాపై ఉన్న ఆంక్షలను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. మతోన్మాద శక్తులు, కార్పొరేట్లు ఏకమై ఒక ఫాసిస్టు తరహా పాలన సాగుతున్న తరుణంలో క్యూబా దేశం ఆచరణ, ఆలోచణ భారత ప్రజలందరికీ అనుసరణీయమన్నారు. చేగువేరా వారసత్వం నుంచి వచ్చిన అలైదా గువేరా, ఎస్తిఫోనియా గువేరా పోరాట పటిమకు, ప్రజాస్వామిక చైతన్యానికి మరింత ప్రేరణ ఇవ్వాల్సిన అవసరముందని చెప్పారు. వారికి సాదరంగా ఆహ్వానం పలుకుదామన్నారు. ఈ కార్యక్రమంలో ఐప్సో రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ధర్మేంధ్ర, గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్యనాయక్, బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర కార్యదర్శి పాండురంగాచారి తదితరులు పాల్గొన్నారు.