Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 24 రకాల సృజనాత్మక పోటీలు
- ఆహ్వాన సంఘం అధ్యక్షులు, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ
నవతెలంగాణ-ముషీరాబాద్
పిల్లల్లో సృజనాత్మకతను పెంచేందుకు ఈ నెల 26, 27వ తేదీల్లో తెలంగాణ బాలోత్సవం నిర్వహించబోతున్నట్టు ఆహ్వాన సంఘం అధ్యక్షులు, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ తెలిపారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం తెలంగాణ బాలోత్సవానికి సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ.. బాలోత్సవం ద్వారా పిల్లల్లో స్నేహభావం, సేవా తత్పరత, మానవత్వం, సోదరతత్వం నెలకొల్పి సృజన వేదికగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తామని తెలిపారు. పిల్లల పట్ల ఆన్లైన్ గేమ్స్ మృత్యు క్రీడలుగా మారాయని, వాటిని వెంటనే నిషేధించాలన్నారు. పిల్లల్లో సహకారతత్వం, పెద్దవారికి, సాటి వారికి సేవ చేయాలన్న భావన కొరవడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బాలోత్సవాల్లో ధైర్యం, శౌర్యం, సేవ, గుణం పెంచే ప్రయత్నం చేస్తామని తెలిపారు. తెలంగాణ బాలోత్సవం గౌరవాధ్యక్షులు, భారత్ కాలేజీల అధినేత సీహెచ్.వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. చదువు చాలా ముఖ్యమే కానీ చదువుతోపాటు పిల్లల్లో క్రీడా నైపుణ్యం కూడా ముఖ్యమన్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు సృజన వికాసానికి తోడ్పాటు అందిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తల్లిదండ్రులకు, పాఠశాలల యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎస్.వినయకుమార్, తెలంగాణ బాలోత్సవం కార్యదర్శి భూపతి వెంకటేశ్వర్లు, నిర్వాహణ కమిటీ ప్రధాన కార్యదర్శి ఎన్.సోమయ్య, ఉపాధ్యక్షులు జి.బుచ్చిరెడ్డి, బాలోత్సవ ఉపాధ్యక్షులు సుజావతి, కమిటీ సభ్యులు ఈ.మమత, ఎం.మారన్న, హరి, బండి ప్రసాద్, జెకె శ్రీనివాస్, అనుముల ప్రభాకర్, దూది సుశీల తదితరులు పాల్గొన్నారు.