Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి కాంట్రాక్టు కార్మికుల ఒప్పందాన్ని అమలు చేయాలి
- సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులకు వర్తించే కనీసవేతనాల జీవోలను వెంటనే విడుదల చేసి అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు డిమాండ్ చేశారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికుల ఒప్పందాన్ని అమలు చేయాలని కోరారు. గురువారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్లో సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం(సీఐటీయూ అనుబంధం) సమావేశాన్ని యర్రగాని కృష్ణయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా చుక్కరాములు మాట్లాడుతూ..కనీన వేతనాలను రివైజ్ చేయకపోవడం వల్ల అరకొర వేతనాలతో కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక రంగాల కార్మికులు దశల వారీగా పోరాటాలు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని విమర్శించారు. గత సెప్టెంబర్‌లో జేఏసీ ఆధ్వర్యంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు 18 రోజులపాటు చేసిన సమ్మె ఫలితంగా లేబర్ కమిషనర్ సమక్షంలో ఒప్పందం కుదిరిందన్నారు. అయితే, ఆ ఒప్పందం అమలుకు తక్షణమే యాజమాన్యం సర్క్యూలర్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 22 అమలు కోసం సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏప్రిల్ 5న ఢిల్లీలో జరుగుతున్న కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ ర్యాలీని జయప్రదం చేయాలని కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. సింగరేణిలో నమస్యల పరిష్కారానికి అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ ప్రసంగించారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు, కోశాధికారి వి.కుమారస్వామి, రాష్ట్ర నాయకులు కె. రాజయ్య, శ్రీను, ఓదెలు, వి. కుమారి, ఐలయ్య, ఎం, చంద్రశేఖర్, శ్రీనివాస్, వేణు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.