Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టిగ్లా నాయకులకు ఇంటర్ విద్యా కమిషన్ హామీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకుల సమస్యలను పరిష్కరించేందుకు ఇంటర్ విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ హామీ ఇచ్చారని తెలంగాణ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ (టిగ్లా) రాష్ట్ర అధ్యక్షులు మైలారం జంగయ్య, ప్రధాన కార్యదర్శి మాచర్ల రామకృష్ణగౌడ్ తెలిపారు. గురువారం హైదరాబాద్లో మిట్టల్తో వారు సమావేశమయ్యారు. అనంతరం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ కళాశాలలో పనిచేసే అన్ని కేటగిరీల ఉద్యోగుల సీనియార్టీ జాబితాలను త్వరగా పూర్తి చేసి వెబ్సైట్లో పెట్టేందుకు అంగీకరించారని తెలిపారు. రాబోయే ఇంటర్ పరీక్షల్లో అన్ని రకాల విధులనూ బోర్డు నిబంధనల ప్రకారం సీనియార్టీ ఆధారంగా కేటాయిస్తామన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ కాలేజీల్లో కనీస అవసరాలు తీర్చడానికి నిధులు కేటాయిస్తామంటూ హామీ ఇచ్చారని వివరించారు. బోధనేతర సిబ్బందికి పది శాతం కోటా కింద జూనియర్ లెక్చరర్లుగా అతి త్వరలో పదోన్నతులు కల్పించేందుకు అంగీకరించారని తెలిపారు. ఇంటర్ బోర్డు, కమిషనర్ కార్యాలయంలో సిబ్బందికి త్వరలోనే పనివిభజన చేస్తామన్నారని పేర్కొన్నారు. విద్యార్థులకు బేసిక్ లెర్నింగ్ మెటీరియల్ సాఫ్ట్ కాపీ ఇస్తామన్నారని వివరించారు. కాంట్రాక్టు అధ్యాపకులకు స్పౌజ్ బదిలీలు, మెడికల్ బదిలీలు, పరస్పర జోనల్ బదిలీలకు కమిషనర్ అంగీకరించారని తెలిపారు. కాంట్రాక్టు అధ్యాపకుల సమాచారాన్ని ప్రభుత్వానికి పంపేందుకు కృషి చేస్తామన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి దుర్గాప్రసాద్, ఉపాధ్యక్షులు చంద్రయ్య, మాన్య నాయక్, అవిలయ్య, సంయుక్త కార్యదర్శి మంజునాయక్, నాయకులు సైదులు, డాక్టర్ పరశురాములు, మృత్యుంజయ, ఆనంద్, స్వప్న, ముడి శేఖర్, సైదులు, గణేష్, వెంకన్న, బాబు తదితరులు పాల్గొన్నారు.