Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దుండగులను వెంటనే అరెస్టు చేయాలి
- మల్లికార్జున్‌పై అక్రమ కేసులను ఎత్తేయాలి
- స్వేచ్ఛ ఆధ్వర్యంలో ప్రజాసంఘాల నిరసన
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
నిజామాబాద్ జిల్లా కోటగిరి జెడ్పీ హైస్కూల్ టీచర్ మల్లికార్జున్‌పై దాడి అమానుషమని, దుండగులను వెంటనే అరెస్టు చేయాలని స్వేచ్ఛ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టర్‌తోపాటు సీపీకి, విద్యాశాఖాధికారులకు విజ్ఞప్తి చేసింది. రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు భావప్రకటన స్వేచ్ఛ పరిరక్షణకు నడుం బిగించాయి. ఈ మేరకు స్వేచ్ఛ జేఏసీగా ఏర్పడి గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నేతలు ర్యాలీ, మానవహారం నిర్వహించారు. తర్వాత పోలీస్ కమిషనర్ నాగరాజును కలిసి వినతిపత్రం సమర్పించారు. మల్లికార్జున్‌పై కేసులు ఎత్తివేయాల్సిందిగా, టీచర్‌పై దాడి చేసిన దుండగులను అరెస్టు చేయాల్సిందిగా కోరారు. అక్కడి నుంచి కలెక్టర్ కార్యాలయానికి చేరి వినతిపత్రం ఇచ్చి.. వెంటనే చర్య తీసుకోవాలని కోరారు. ఇకముందు ఇలాంటి చర్యలు ఎక్కడ జరిగినా జేఏసీ తక్షణ కార్యాచరణ ప్రకటిస్తుందని, ఈ విషయంలో చర్యలు తీసుకోకపోతే. రాష్ట్ర స్థాయిలో ఉన్న ఉపాధ్యాయుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తుందని జేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏమాత్రం అశ్రద్ధ చేసినా త్వరలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ప్రకటించారు. భావ ప్రకటన స్వేచ్ఛను అందిస్తున్న ప్రాథమిక హక్కు ఆర్టికల్ 19(1)కు ఆటంకం కలిగించే ఎటువంటి చర్యలనైనా ఖండిస్తామని తెలిపారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారిని కలిసి మల్లికార్జున్‌కు రక్షణ కల్పించాలని కోరారు. రాష్ట్ర స్థాయి నుంచి జేఏసీ స్టీరింగ్ కమిటీ మెంబర్లు, కన్వీనర్ రమేష్, స్టీరింగ్ కమిటీ మెంబర్స్ కోల జనార్ధన్, ఝాన్సీ, గుత్తా జ్యోత్స్న, వహీద్, హనుమంతరావు, స్కైలాబ్‌బాబు, కోట రమేష్, అయిత విజరు, ఆదంరాజ్, స్పార్టకస్, డా.తిరుపతయ్య, ఆల్గోట్ రవీందర్, గొర్రెపాటి మాధవరావు, జిల్లా నుంచి జేఏసీ నాయకులు రమేష్ బాబు, ఆకుల పాపయ్య, నర్రా రామారావు, సుధాకర్, కోయేడి నరసింహులు, గోవర్ధన్, రామ్మోహన్రావు, నరేందర్, గణేష్, దాసు, శివకుమార్, మహేష్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
దాడికి పాల్పడిన వారిని శిక్షించాలి
17న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, సామూహిక రాయబారాలు :సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నిజామబాద్ జిల్లా కోటగిరిలో దళిత టీచర్ మల్లికార్జున్‌పై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ యాక్టు నమోదు చేయాలనీ, నిందితులను కఠినంగా శిక్షించాల ని సీఐటీయూ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ నెల 17న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేయాలనీ, సామూహిక రాయబారాలు నడిపి అధికారులకు వినతి పత్రాలు అందజేయాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు గురువారం సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఒక ప్రకటన విడుదల చేశారు. వినాయక చవితి చందాను ఇవ్వడానికి నిరాకరించాడనే కారణంతో ఉపాధ్యాయుడిని అవమానించి, దాడి చేయడాన్ని ప్రజా సంఘాలు, ప్రజాతంత్రవాదులు, సామాజిక సంస్థలు, ముక్తకంఠంతో ఖండించాలని కోరారు. కులం పేరుతో దూషిస్తూ, బలవంతంగా గుడిలో బొట్టు పెట్టించి, అవమానించేలా గ్రామ విధుల్లో ఊరేగించి అనాగరిక చర్యలకు పాల్పడిన ఆర్ఎస్ఎస్, బీజేపీ మతోన్మాద దుండగుల చర్యలు దుర్మార్గపూరితమైనవని పేర్కొన్నారు. సీఐటీయూ పిలుపులో టీచర్లు, కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని మనువాదుల దాడికి గురైన మల్లిఖార్జున్‌కు అండగా నిలవాలని కోరారు.