Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో ఏర్పాట్లు
- ముఖ్యఅతిధిగా విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి
- ప్రారంభోపన్యాసం చేయనున్న కేరళ మాజీ మంత్రి శైలజా టీచర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర ఐదో మహాసభలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మహాసభలను రంగారెడ్డి జిల్లా సాగర్ రోడ్ మన్నెగూడలోని బీఎంఆర్ సార్థా కన్వెన్షన్‌లో రెండురోజులపాటు నిర్వహించనున్నారు. టీఎస్‌యూటీఎఫ్ జెండాలు, తోరణాలు, ఫ్లెక్సీలు, పోస్టర్లతో ఆ ప్రాంతమంతా ముస్తాబైంది. ఈ మహాసభలకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, యాజమాన్యాలు, గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్ల నుంచి 550 మంది ప్రతినిధులు, పరిశీలకులు హాజరవుతారు. ఈ సందర్భంగా శుక్రవారం తొలిరోజు ఉపాధ్యాయుల మహాప్రదర్శన, బహిరంగ సభను నిర్వహిస్తారు. దీనికి ముఖ్యఅతిధిగా విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి హాజరవుతారు. కేరళ మాజీ మంత్రి కెకె శైలజా టీచర్ ప్రారంభోపన్యాసం చేస్తారు. అతిధులుగా ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఆహ్వానసంఘం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కె నాగేశ్వర్‌తోపాటు రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు హాజరవుతారు. విద్యారంగం, ఉపాధ్యాయుల సంక్షేమం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై చర్చించనున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఇప్పటి వరకు నిర్వహించిన పోరాటాలను సమీక్షిస్తారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణకు రూపకల్పన చేస్తారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి తీర్మానాలను ఆమోదిస్తారు. ముఖ్యంగా భవిష్యత్ తరాలకు విద్యను దూరం చేసే నూతన విద్యావిధానం (ఎన్ఈపీ)-2020, ఉద్యోగులు, ఉపాధ్యాయుల సామాజిక భద్రతకు విఘాతం కలిగిస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) విధానం రద్దు కోసం నిర్దిష్టమైన కార్యాచరణను రూపొందిస్తారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, నియామకాలతోపాటు 317 జీవో బాధితుల న్యాయం చేయడం కోసం భవిష్యత్తులో టీఎస్‌యూటీఎఫ్ స్వతంత్రంగా, యూఎస్పీసీ నేతృత్వంలో ఐక్య ఉద్యమాలు శ్రీకారం చుట్టనుంది. ప్రభుత్వ స్కూళ్ల పరిరక్షణ, మౌలిక వసతుల కల్పన, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ఈ మహాసభల్లో చర్చించనున్నారు. విద్యారంగం, ఉపాధ్యాయుల సమస్యలపై రెండురోజులపాటు చర్చించిన వివిధ అంశాలపై నిర్దిష్ట ప్రతిపాదనలు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తారు.