Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్...
- పదోన్నతులు, బదిలీలపై సీఎం ప్రత్యేక దృష్టి
- యూటీఎఫ్ రాష్ట్ర మహాసభలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- టీచర్లు సామాజిక సంస్కరణ వాదులుగా ఉండాలి : కేరళ మాజీ మంత్రి కెకె శైలజా టీచర్
- పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలంటూ సూచన
- ఐక్య పోరాటాలతోనే హక్కుల పరిరక్షణ
- నూతన విద్యావిధానాన్ని రద్దు చేయాలి
- స్ఫూర్తిదాయకంగా టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర మహాసభలు ప్రారంభం
నాగటి నారాయణ నగర్ (మన్నెగూడ)నుంచి బొల్లె జగదీశ్వర్
సమాజంలో మార్పు తెచ్చే శక్తి ఉపాధ్యాయులకే ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. అందుకు వారు నాంది పలకాలని ఆమె పిలుపునిచ్చారు. విలువలతో కూడిన విద్యనందించటం ద్వారా విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి త్వరలోనే అనుమతిస్తామనీ, వాటిని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ను జారీ చేస్తామని హామీనిచ్చారు. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. ఈ అంశంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలన్నింటికీ ఈ యేడాది పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర ఐదో మహాసభలు శుక్రవారం రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో స్ఫూర్తిదాయకంగా ప్రారంభమ య్యాయి. తొలుత రాగన్నగూడలోని జెడ్పీహెచ్ఎస్ నుంచి మన్నెగూడలోని బీఎంఆర్ సార్థ కన్వెన్షన్ సెంటర్ వరకు ఉపాధ్యాయులు మహా ప్రదర్శనను నిర్వహించారు. మహిళా టీచర్లు ప్రత్యేక డ్రెస్‌కోడ్‌తో హాజరు కావటంతో ర్యాలీ అత్యంత ఆకర్షణయంగా కొనసాగింది. 'సీపీఎస్‌ను రద్దు చేయాలి, ఓపీఎస్‌ను పునరుద్ధరించాలి, ఎన్ఈపీ- 2020ని రద్దు చేయాలి, ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు కల్పించాలి. పాఠశాలల్లో స్వచ్ఛ కార్మికులను నియమించాలి' అంటూ ఉపాధ్యాయులు ఈ సందర్భంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం జాతీయ పతాకాన్ని టీఎస్‌యూటీఎఫ్ సీనియర్ నాయకులు ఎన్ పురుషోత్తంరావు, ఎస్టీఎఫ్ఐ పతాకాన్ని సీనియర్ నాయకులు ఆర్ నర్సింహాచారి, టీఎస్‌యూటీఎఫ్ పతాకాన్ని పి మాణిక్‌రెడ్డి ఆవిష్కరించారు. అమరవీరుల స్థూపానికి పూలమాలలేసి నివాళులర్పించారు.
అనంతరం టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య అధ్యక్షతన నిర్వహించిన ప్రారంభ సభకు సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేరళ ప్రభుత్వ విప్, ఆ రాష్ట్ర మాజీ ఆరోగ్యశాఖ మంత్రి కెకె శైలజా టీచర్ ప్రారంభో పన్యాసం చేశారు. శాసనమండలి సభ్యుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు కూడా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ... టీఎస్‌యూటీఎఫ్ నాయకులు చెప్పే అంశాల్లో బాధ్యతలతోపాటు డిమాండ్లు కూడా ఉంటాయని చెప్పారు. కరోనా సమయంలో సంక్షోభంలో ఉన్న విద్యా వ్యవస్థను కాపాడటంలో ఉపాధ్యాయుల కృషి ప్రత్యేకమైందని అన్నారు. టీవీలు, డిజిటల్ విధానంలో బోధనకు సహకరించటం ద్వారా ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులు నష్టపోకుండా వారు చూశారని వివరించారు. రాష్ట్రంలోని ఉద్యోగుల్లో సగం మంది ఉపాధ్యాయులే ఉంటారని చెప్పారు. వారి సమస్యలపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులను న్యాయపరమైన సమస్యల్లేకుండా చేపట్టాలంటూ సీఎం ఆదేశించారని గుర్తు చేశారు. మోడల్ స్కూళ్ల టీచర్లకు పదోన్నతుల ప్రక్రియను చేపట్టగానే కొందరు కోర్టుకెళ్లారని చెప్పారు. పండితులు, పీఈటీల అప్‌గ్రెడేషన్ ప్రక్రియ కోర్టు పరిధిలో ఉందని ఈ సందర్భంగా మంత్రి వివరించారు.
మనువాద భావజాలం ప్రమాదం : శైలజా టీచర్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యారంగంలో మనువాద భావజాలాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నదనీ, ఇది దేశానికే ప్రమాదకరమని శైలజా టీచర్ హెచ్చరించారు. పాఠ్యాంశాల్లో మనుస్మృతిని ప్రవేశపెట్టడం సరైంది కాదన్నారు. చాతుర్వర్ణ వ్యవస్థ ఉండాలని చెప్పడంతోపాటు స్త్రీకి స్వేచ్ఛ లేదని చెప్పే మనుస్మృతిని అంగీకరించేది లేదని ఆమె నొక్కి చెప్పారు. కర్నాటకలో బడుల గోడలకు కాషాయరంగును వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రంగంటే తమకు భయం లేదనీ, కానీ సంఫ్‌ు పరివార్ విధానాలే ప్రగతికి వ్యతిరేకమని వివరించారు. పెట్టుబడిదారీ విధానంతో ప్రపంచం మొత్తం ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయిందని చెప్పారు. దానికి ప్రత్యామ్నాయం సోషలిజమేనని ఉద్ఘాటించారు. సోషలిజంలో ఉపాధి అనేది హక్కుగా మనకు లభిస్తుందన్నారు. విప్లవం ఒక్కరోజులో వచ్చేది కాదని శైలజా టీచర్ ఈ సందర్భంగా తెలిపారు. అది నిరంతర ప్రక్రియని వివరించారు. మోడీ పాలనలో నిరుద్యోగం పెరిగిపోయిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని యువతకు ఉద్యోగాలు, ఉపాధితోపాటు భావప్రకటనా స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందన్నారు. ఫ్యూడల్ భావజాలాన్ని పెంచడం కోసమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నూతన విద్యావిధానాన్ని రూపొందించిందని విమర్శించారు. ఆ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేరళ ప్రభుత్వం దాన్ని అంగీకరించలేదని వివరించారు. విద్యా కేంద్రీకరణ, ప్రయివేటీకరణ, కాషాయీకరణే నూతన విద్యావిధానం లక్ష్యాలని విడమరిచి చెప్పారు. ఆ రకంగా బీజేపీ విద్యారంగంలో సైతం తన మతతత్వ ఎజెండాను అమలు చేస్తున్నదని చెప్పారు. దాంతో అసలు మన రాజ్యాంగమే ప్రమాదంలో పడిందని హెచ్చరించారు. మోడీ సర్కారు దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరిస్తున్నదని వాపోయారు. ఈ క్రమంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికతత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత టీచర్లపై ఉందని ఆమె సూచించారు. సామాజిక సంస్కరణవాదులుగా, విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించేలా ఉపాధ్యాయులు పనిచేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని సూచించారు. రాజ్యాంగ రక్షణ కోసం దేశంలోని అన్ని పార్టీలూ ఐక్యం కావాల్సిన తరుణంం ఆసన్నమైందని చెప్పారు. బీజేపీపై పోరాడేందుకే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించారని గుర్తు చేశారు. మోడీ పాలనతో ఫాసిజం రాబోతున్నదని హెచ్చరించారు. దానికి వ్యతిరేకంగా అందరం కలిసి ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
వైషమ్యాలను రెచ్చగొడుతున్న బీజేపీ : నాగేశ్వర్
మతం పేరుతో బీజేపీ ప్రభుత్వం వైషమ్యాలను రెచ్చ గొడుతున్నదని మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ అన్నారు. సమాజంలో భావజాల యుద్ధం నడుస్తున్నదనీ, ఈ సమయంలో ప్రగతిశీల ఉపాధ్యాయులు మౌనంగా ఉండొద్దని కోరారు. ఆర్థిక అంతరాలుండొద్దంటూ రాజ్యాంగం చెప్తున్నదనీ, సామాన్యులకు రోజు కూలి రూ.300 వస్తే, అదానీకి రోజుకు రూ.1,600 కోట్ల మేర ఆదాయమొస్తుందని వివరించారు. పాలకుల విధానాల వల్ల ఆర్థిక అంతరాలు పెరిగిపోతున్నాయని చెప్పారు. రాజ్యాంగం, ఫెడరల్ వ్యవస్థ, భావప్రకటనా స్వేచ్ఛపై దాడి జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. సీబీఐ, ఈడీ తరహాలో న్యాయమూర్తులను నియమిస్తామంటూ కేంద్ర న్యాయ శాఖ మంత్రి చెప్పటం శోచనీయమని అన్నారు. తమిళనాడు గవర్నర్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వాకౌట్ చేయడం సరైంది కాదన్నారు. తెలంగాణ గవర్నర్‌కు రాజ్యాంగం గురించి తెలియదని ఆయన ఎద్దేవా చేశారు. మంత్రిమండలి సలహా మేరకే నిర్ణయాలు తీసుకోవాలనీ, గవర్నర్లకు ప్రత్యేక అధికారాల్లేవని గుర్తు చేశారు.
పీఎఫ్ఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తావా..? పీఠాన్ని వదులుకుంటావా? : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) చట్టాన్ని రద్దు చేస్తావా... ఢిల్లీ పీఠాన్ని వదులుకుంటావా? అంటూ మోడీ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సమయం ఆసన్నమైందని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరణ, ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలను వేగంగా అమలు చేస్తున్నదని తెలిపారు. ఆ విధానాల్లో భాగంగానే సీపీఎస్ విధానాన్ని అమల్లోకి తెచ్చారని వివరించారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ ఆగకుండా సీపీఎస్ విధానం రద్దు కాబోదని చెప్పారు. మోడీ సర్కార్ కేంద్రీయ విశ్వవిద్యాలయాలను మనువాద కేంద్రాలుగా మారుస్తున్నదని అన్నారు. రోహిత్ వేములది ఆత్మహత్య కాదనీ, అది ప్రభుత్వ హత్య అని చెప్పారు. మోడీ విధానాలతో దేశంలోని ఆర్థిక, సామాజిక రంగాల్లో అసమానతలు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే కాకుండా కేంద్రీయ విద్యాలయాల్లోనూ ఉపాధ్యాయ ఖాళీలున్నాయని తెలిపారు. సీపీఎస్, ఎన్ఈపీ రద్దు కోసం పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల కోసం వెంటనే షెడ్యూల్‌ను ప్రకటించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకిక విలువలుంటేనే ఉపాధ్యాయులకు హక్కులుంటాయని ఎస్టీఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షులు ఎం సంయుక్త అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పురాతన కాలంనాటి పరిస్థితులను విద్యారంగంలోకి తెచ్చేందుకు నూతన విద్యావిధానాన్ని కేంద్రం తీసుకొచ్చిందని ఆమె తెలిపారు. ఎన్ఈపీని రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని కోరారు. వాయిస్ ఆఫ్ తెలంగాణ టీచర్ పత్రికా ప్రధాన సంపాదకులు పి మాణిక్‌రెడ్డి మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం వద్ద మహాసభలను నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. ఉపాధ్యాయులంతా టీఎస్‌యూటీఎఫ్ వైపు చూస్తున్నారని చెప్పారు. తమ సంఘం సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేయడం తోపాటు ప్రతి అంశాన్నీ శాస్త్రీయంగా ఆలోచిస్తుం దని వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, జి.జైపాల్ యాదవ్, రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ అనితా హరినాథ్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ సత్తు వెంకట రమణారెడ్డి, డీసీసీబీ చైర్మెన్ మనోహర్‌రెడ్డి, తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్, ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్, బీఆర్ఎస్ నాయకులు క్యామ మల్లేష్, టీఎస్‌యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావ రవి, ఉపాధ్యక్షులు సిహెచ్ రాములు, సిహెచ్ దుర్గాభవాని, కోశాధికారి టి లక్ష్మారెడ్డి, ఆహానసంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు ఈ గాలయ్య, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్, టీడబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి బి బసవ పున్నయ్య తదితరులు పాల్గని ప్రసంగించారు.