Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణలోనూ అదే తీరు
- బీజేపీ వ్యతిరేక శక్తులతో సీపీఐ(ఎం) కలిసి పోరాటం : తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ - భువనగిరి
దేశంలో బీజేపీది దుష్ట రాజకీయం చేస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలోని రహదారి బంగ్లాలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా సాగుతున్నాయన్నారు. బీజేపీ తెలంగాణలో పాగా వేయడం కోసం ప్రలోభాలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి ఎవరొచ్చినా చేర్చుకుంటామనడం బీజేపీ రాజకీయ వ్యభిచారానికి నిదర్శనమన్నారు. ఖమ్మంలో ఓ ప్రధాన నాయకున్ని బీజేపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ సిద్దమైందన్నారు. అందుకు ఈటల రాజేందర్‌తో ప్రత్యేక కమిటీ వేసిందన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ దాడులంటూ బెదిరింపులకు పాల్పడుతూ.. మరోవైపు కోట్లాది రుపాయలతో నాయకులను అంగట్లో సరుకుల మాదిరి కొనుగోలు చేస్తోందన్నారు. బీజేపీ వ్యతిరేక శక్తిగా ఉన్న బీఆర్ఎస్తో సీపీఐ, సీపీఐ(ఎం) కలిసివెళ్లాలని నిర్ణయించుకున్నాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీని ఓడించే శక్తి లేదని మునుగోడులో స్పష్టమైందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ ఎజెండా అని తమ్మినేని తెలిపారు. ప్రజాల పక్షాన నిలబడి సమస్యలపై పోరాడుతామన్నారు. బీజేపీ పాలనలో దేశం తిరోగమనం వైపు నడుస్తోందన్నారు. తెలంగాణలో నైతిక విలువలు, అభ్యుదయ భావాలు అధికంగా ఉంటాయన్నారు. రాష్ట్ర ప్రజల్లో వామపక్ష భావజాలం ఎక్కువగా ఉందన్నారు. బీజేపీ కాషాయ రాజకీయాలు, మత రాజకీయాలు తెలంగాణలో పారవని స్పష్టం చేశారు. 48కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా చేసి కార్మిక వ్యతిరేక చట్టాలను అమలు చేస్తున్న ప్రధాని మోడీని సీఎం కేసీఆర్ వ్యతిరేకిస్తే ఆయన వెంట కార్మికులు నడవడం సబబు అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్వేస్లి, జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య, స్కైలాబ్‌బాబు, బట్టుపల్లి అనురాధ, జిల్లా నాయకులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దాసరి పాండు, మాయ కృష్ణ పాల్గొన్నారు
భువనగిరి కోర్టుకు తమ్మినేని, నేతలు హాజరు
అంబోజు నరేష్, స్వాతి కుల దురహంకార హత్య దోషులను శిక్షించాలని టీ-మాస్ అధ్వర్యంలో జూన్ 9, 2017లో జరిగిన రాస్తారోకోపై కేసులో భాగంగా శుక్రవారం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, అరుణోదయ సాంస్కృతిక వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు విమలక్కలతోపాటు ఏడుగురు కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు ఎనిమిది మందిపై నమోదైంది. ఈ కేసులో ఏ1గా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కల్లూరి మల్లేశం, ఏ2 గా తమ్మినేని వీరభద్రం, ఏ3గా విమలక్క, ఏ4గా రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఫైళ్ల ఆశయ్య, ఏ5గా రాజారాం నాయక్, ఏ6 గా కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్‌వేస్లీ, ఏ7గా రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ బాబు, ఏ8గా ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య పేర్లను నమోదు చేశారు.
తమ్మినేని వీరభద్రం, విమలక్క.. ఇతర నాయకులను బార్ అసోసియేషన్, ఐలు ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా లాయర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఇస్మాయిల్, జిపి నాగారం అంజయ్య, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేశవరెడ్డి, మాజీ అధ్యక్షులు నర్సింహయాదవ్, ఐలు అధ్యక్షులు మామిడి వెంకట్ రెడ్డి, లాయర్స్ యూనియన్ నాయకులు రామిరెడ్డి, సోమయ్య, జగతయ్య, బొల్లెపల్లి కుమార్ పాల్గొన్నారు.