Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేలాదిగా తరలివచ్చిన ఉపాధ్యాయులు
- రాగన్నగూడెం నుంచి సభ ప్రాంగణం వరకు భారీ ప్రదర్శన
- జాతీయ పతాకం, ఎస్టీఎఫ్ఐ, యూటీఎఫ్ పతాకాల ఆవిష్కరణ
- అమరులను స్మరిస్తూ స్థూపానికి ప్రముఖుల నివాళి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర 5వ మహాసభ రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌లోని బీఎమ్ఆర్ కన్వెన్షన్ కామ్రేడ్ అంబటి నాగయ్యనగర్, కామ్రేడ్ ముంత ఆంజనేయులు ప్రాంగణంలో శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఉదయం 9గంటలకు రాగన్నగూడెం నుంచి సభ ప్రాంగణం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. సుమారు రెండు కిలో మీటర్ల మేర సాగిన ఈ ర్యాలీలో వేలాది మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 'ఉపాధ్యాయుల, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి.. విద్యా హక్కులను కాపాడాలి.. యూటీఎఫ్ జిందాబాద్.. ఉపాధ్యాయుల ఐక్యత వర్ధిల్లాలి.. సాధిస్తాం సాధిస్తాం అమరుల ఆశయాలు సాధిస్తాం' అంటూ దిక్కులు పిక్కటిల్లేలా ఉపాధ్యాయులు నినాదాలతో హోరెత్తించారు. తమ సమస్యలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించారు. 'పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప' అన్న నినాదాలతో ర్యాలీ ఉత్సాహావంతంగా సాగింది. ఈ ర్యాలీలో మహిళా ఉపాధ్యాయులు ప్రత్యేక డ్రెస్ కోడ్‌తో ర్యాలీ ముందు వరుసలో ఉన్నారు.
జెండా ఆవిష్కరణలు..
ర్యాలీ అనంతరం సభా ప్రాంగణంలో సంఘం సీనియర్ నాయకులు జెండాలను ఆవిష్కరించారు. టీఎస్‌యూటీఎఫ్ సీనియర్ నాయకులు కృష్ణమూర్తి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ప్రతినిధులు జాతీయ పతాకానికి గౌరవ వందనం చేస్తూ జనగణమన గీతాన్ని ఆలపించారు.
ఎస్టీఎఫ్ఐ జెండాను సీనియర్ నాయకులు ఆర్.నర్సింహాచారి ఎగురవేశారు. టీఎస్‌యూటీఎఫ్ 5వ మహాసభ సందర్భంగా టీఎస్‌యూటీఎఫ్ జెండాను సీనియర్ నాయకులు, ఉమ్మడి మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పి.మాణిక్‌రెడ్డి ఎగురవేశారు. ప్రతినిధులు పతాకానికి అభివాదం తెలుపుతూ నినాదాలు చేశారు. 'ఎగరాలి ఎగరాలి, ఎర్రెర్రని జెండా.. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ జెండా.. అధ్యయనం-అధ్యాపన సామాజిక స్పృహతో.. హక్కులు, బాధ్యతలు ఎదలో నింపుకున్న జెండా' అంటూ పాటలు ఆలపించారు. పిడికిలెత్తి రెడ్ సెల్యూట్ చేశారు. అనంతరం అమర వీరులను స్మరిస్తూ.. మహాసభలకు హాజరైన కేరళ ప్రభుత్వ విప్ కె.కె శైలజా టీచర్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జంగయ్య, చావ రవి, మహాసభ ఆహ్వాన సంఘం కార్యనిర్వాహక అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గాలయ్య, వెంకటప్ప, తదితరులు అమర వీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు.
సంక్లిష్టంగా విద్యావ్యవస్థ
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య
నేడు దేశంలో విద్యా వ్యవస్థ సంక్లిష్టంగా ఉందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య అన్నారు. బీజేపీ ఫ్రభుత్వం ఇందుకు కారణమని వ్యాఖ్యానించారు.ఉపాధ్యాయులే అవసరం లేదని మోడీ సర్కారు అంటున్నదనీ, దీంతో హక్కులు ప్రశ్నార్ధకం అయ్యాయని చెప్పారు. ఈ చిక్కుముడి విప్పాల్సిన బాధ్యత టీచర్లదేనని స్పష్టం చేశారు. ఈ మేరకు టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఐదో మహసభ ప్రతినిధుల సభలో ప్రారంభోపన్యాసం చేశారు. సామాజిక వివక్ష కొనసాగుతోందని, చదువు అందరికీ చేరేలా యూటీఎఫ్ పరిష్కారం కనుకొనాలని అన్నారు. ప్రజలంతా చదువుకునేలా విద్యా వ్యవస్థను నిర్మించాలని సూచిం చారు. అంబానీ, బిర్లా కమిషన్ చేసిన సిపార్సులను నేటి ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని చెప్పారు. ప్రైవేటు యూనివర్సిటీలు అందులో భాగమేనని అబిప్రాయపడ్డారు. మన్మోహన్, మోడీ విధానాలు ప్రయివేటీకరణను ప్రోత్సహించేలా ఉన్నాయని విమర్శించారు. మతోన్మాదం ఎదైనా ఉన్మాదమేనని అన్నారు. విద్యారంగంలో యూటీఎఫ్ నమూనా ముందుకు రావాల్సిన అవసరంలేదని అభిప్రాయపడ్డారు. కొత్త విధానాలతో ప్రజల్ని చైతన్యం చెయ్యాలని పిలుపు నిచ్చారు. విద్యా వ్యవస్థను నాశనం చేసే చర్యలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. వృత్తిరీత్యా పాఠాలు చెబుతూనే, ప్రవత్తిగా ప్రజలను చైతన్యం చెయ్యాల్సిన అవసరం ఎంతైనా వుందని చెప్పారు. నిజమైన మేధావులుగా టీచర్లు వ్యవరించాలనీ కోరారు.