Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీఆర్ఏల సమస్యపై సాగదీస్తున్న రాష్ట్ర సర్కారు
- ప్రగతిభవన్‌కు పిలిచారు..కూర్చోబెట్టి పంపారు
- న్యాయం చేస్తామంటూనే తాత్సారం
- ఈ సీఎస్ అయినా చొరవ చూపేనా.. సీఎం పరిష్కరించేనా..?
- కోటి ఆశలతో వీఆర్ఏల ఎదురుచూపులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వీఆర్ఏల నిరీక్షణ ఇంకా కొనసాగుతూనే ఉంది. చేద్దాం..చూద్దాం.. అంటూ నాలుగైదు నెలలుగా రాష్ట్ర సర్కారు తాత్సారం చేస్తూ సమస్యను తేగేదాక సాగదీస్తూనే ఉంది. మంత్రి కేటీఆర్ ఇప్పటిదాకా నాలుగు సార్లు చర్చలు జరిపారు...'మీ డిమాండ్లన్నీ న్యాయమైనవే..సీఎం సార్ సానుకూలంగా ఉన్నారు' అంటూనే కాలం వెల్లదీస్తున్నారు. మరోమారు హరీశ్‌రావు కూడా పిలిచి మాట్లాడినా ప్చ్. నిష్పప్రయోజనం. ప్రగతిభవన్ నుంచి పిలుపొస్తే ఇగ తమ సమస్య పరిష్కారం అయినట్టే అని వీఆర్ఏలు మురిసిపోయారు. ప్రగతిభవన్‌లో పొద్దస్తమానం కూర్చోబెట్టి..ఇన్ని చారునీళ్లు పోసి...బుక్కెడు బువ్వపెట్టి...పంపించేయటంతో వారి మురిపెం ఒక్క రోజు ముచ్చటగానే మారిపోయింది. కొత్తగా వచ్చిన సీఎస్ అయినా తమ సమస్యకు ఫుల్‌స్టాఫ్ పెడతారేమోనన్న కొండంత ఆశతో ఆమెనూ కలిశారు. సానుకూలంగా మాట్లాడిన ఆమె అయినా చొరవ చూపి...సీఎం సార్‌ని మెప్పించి సమస్య పరిష్కరిస్తుందా? అట్లాగే సాగదీస్తుందా? అనేది కాలగమనంలో తెలియాల్సిందే. రాష్ట్ర సర్కారు వీర్ఏల ఓపికకు ఇంకెంత కాలం పరీక్ష పెడుతున్నది చూడాల్సిందే.
రాష్ట్రంలో 24 వేలకుపైగా వీఆర్ఏలున్నారు. వీరిలో నూటికి 95 శాతానికిపైగా ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతుల వారే ఎక్కువగా ఉన్నారు. వారి చేతికొచ్చేది అరకొర వేతనాలే. అదీ చిక్కుముడులతో కూడిన కొలువే. తుమ్మితే ఉంటుందో..ఊడుతుందో తెలియని ఉద్యోగం. అలాంటి సమయంలోనే పర్మినెంట్ చేస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటన వారిలో ఆశలు రేపింది. అర్హులందరికీ ప్రమోషన్లు, పేస్కేలు, వారసత్వ ఉద్యోగాలు వస్తాయని సంబురపడ్డారు. కండ్లల్లో కాయలు కాచేలా ఎదురుచూసినా సీఎం చెప్పిన హామీ నోటికే పరిమితమైంది తప్ప ఆచరణలో గడప దాటలేదు. విధిలేని పరిస్థితుల్లో వీఆర్ఏలు సమ్మెలోకి వెళ్లారు. 80 రోజుల పాటు ఒకేమాట మీద కట్టుబడి ఐక్యతతో ముందుకుసాగారు. సర్కారు స్పందించకపోవడంతో గతేడాది సెప్టెంబర్ 13న చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. సద్దిమూటలతో ఎవరికివారు తరలొచ్చి వేలాదిగా పోగవ్వటంతో సర్కారు సైతం ఖిన్నురాలైపోయింది. అసెంబ్లీ సమావేశాలుండటంతో సమస్య తీవ్రం కాకుండా జేఏసీ బృందాన్ని మంత్రి కేటీఆర్ అసెంబ్లీకి పిలుపించుకున్నారు. 'వీఆర్ఏల డిమాండ్లు న్యాయమైనవి. సానుకూలంగా ఉన్నాం. చనిపోతున్న వీఆర్ఏలందరూ తెలంగాణ బిడ్డలే. బాధగా ఉంది. స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాలు, జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు కార్యక్రమాలు ముగియగానే సెప్టెంబర్ 20న చర్చలకు పిలుస్తాం' సమ్మె విరమిస్తే చర్చలు జరిపి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి పంపారు. మంత్రి కేటీఆర్, హరీశ్‌రావు, సీఎస్ సోమేశ్‌కుమార్‌తో పలుసార్లు చర్చలూ జరిపారు. హామీలన్నీ నెరవేరినట్టేనన్నంత నమ్మించారు. 'నవంబర్ ఏడో తేదీ వరకు ఆగండి. మునుగోడు ఉప ఎన్నికల కోడ్ అయిపోగానే సమస్యను పరిష్కరిస్తాం. సీఎం మీ పట్ల సానుకూలంగా ఉన్నారు. దయచేసి సమ్మె విరమించండి' అంటూ స్వయంగా అప్పటి సీఎస్ సోమేశ్‌కుమార్‌తో నచ్చజెప్పించారు. దాంతో 80 రోజుల సమ్మెకు ఫుల్‌స్టాఫ్ పడింది. ఆ రోజు చర్చల సందర్భంగా సమ్మెకాలానికి సంబంధించిన వేతనాన్ని ఇప్పించేందుకు ప్రయత్నిస్తామనీ, చలో అసెంబ్లీ, ఆర్టీసీక్రాస్రోడ్డులో జరిగిన మెరుపు ధర్నాల సమయంలో వీఆర్ఏలపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని సీఎస్ హామీనిచ్చారు. మునుగోడు ఉప ఎన్నిక అయిపోయిన తర్వాత తర్వాత ఎవ్వరూ పట్టించుకోలేదు. వీఆర్ఏలు మరోమారు పోరాటానికి సన్నద్ధమవుతున్న మంత్రి కేటీఆర్ డిసెంబర్ 21వ తేదీన జేఏసీ బృందాన్ని పిలిపించి మాట్లాడారు. త్వరలో సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. తర్వాతి రోజే ప్రగతిభవన్‌కు పిలుపు రావటంతో ఇక తమకిచ్చిన హామీలు నెరవేరినట్టేననుకున్నారు. ఏమైందో ఏమోగానీ వీఆర్ఏలను పొద్దంతా అక్కడే కూర్చోబెట్టారు. రెండుమూడు సార్లు చారు తాపించారు. మధ్యాహ్నం బుక్కెడు బువ్వపెట్టి సాయంత్రం కాగానే పంపించేశారు. అసలు అక్కడకు ఎందుకు పిలిచారో? పొద్దస్తమానం ఎందుకు కూర్చోబెట్టారో? అర్థంకాక వీఆర్ఏ జేఏసీ నాయకులు తలలు పట్టుకున్నారు. దీనినే ఉన్నతాధికారుల వద్ద జేఏసీ నేతలు ప్రస్తావిస్తే...'సీంఎ సార్ మీ పట్ల సానుకూలంగా ఉన్నారు. జర ఓపిక పట్టండి' అంటూ సమాధానం రావటం కొసమెరుపు. కొత్త సీఎస్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చిన సందర్భంలోనూ అదే హామీ. 80 రోజుల సమ్మె కాలం నాటి వేతనాలు ఇస్తామన్నదీ బుట్టదాఖలైంది. కేసుల ఎత్తివేత అంశమూ మరుగున పడిపోయింది. ఓపికకూ సహనం ఉంటుంది. వీఆర్ఏలలో అది కాస్తా నశిస్తే అంతిమంగా సర్కారుకే నష్టం.