Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చేనెల 10న జాతీయ రహదారుల దిగ్భందనం
- అనాధల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వీడాలి
- ఈ నెల 31న ఇందిరాపార్కు వద్ద దీక్ష : విలేకర్ల సమావేశంలో మందకృష్ణ
నవతెలంగాణ - హైదరాబాద్ బ్యూరో
ఎస్సీ వర్గీకరణకు ప్రారంభం నుంచి మద్దతు ప్రకటిస్తూ.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అంశాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్న బీజేపీ అసలు దోషని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ విమర్శించారు. మోడీ సర్కార్‌పై ప్రత్యక్ష పోరాట కార్యాచరణకు దిగుతామనీ, ఇక ఆ సర్కార్‌పై సమరమేనని తెలిపారు. డబులింజన్ సర్కారొస్తేనే సమస్యల పరిష్కారం సులువవుతుందని బీజేపీ జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు పదేపదే చెబుతున్నారని గుర్తుచేశారు. మరి కర్నాటకలో డబులింజన్ సర్కారే కదా! ఉన్నది.. ఆ రాష్ట్రంలో జస్టిస్ సదాశివన్ కమిషన్ రిపోర్టును ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్దత కల్పించటంలో కేంద్ర ప్రభుత్వంతోపాటు కర్నాటక ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఎన్నికల సందర్బంలో బీజేపీ తమ ఎన్నికల ప్రణాళికలో ఉషామెహ్ర కమిషన్ సిఫారుసులను అమలు చేస్తామని ప్రకటించిందనీ, ఇప్పుడెందుకు నోరుమెదపటం లేదో చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన మోడీ, తొమ్మిదేండ్లయినా..ఈ అంశం చర్చకు రాకపోవటం మాదిగల పట్ల చిన్నచూపు తప్పితే మరొకటి కాదన్నారు.కార్పొరేట్లకు అనుకూలమైన బిల్లులను రాత్రికి రాత్రే తీసుకొస్తున్నారని గుర్తుచేశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా బీజేపీపై ప్రత్యక్ష పోరాటాలు నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలిపారు.ఫిబ్రవరి ఒకటి నుంచి తొమ్మిది వరకు ఎల్బీ నగర్ చౌరస్తా నుంచి రాష్ట్ర సరిహద్దు వరకు హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై పాదయాత్ర చేయనున్నట్టు తెలిపారు. పదో తేదీన 12గంటల జాతీయ రహదారి దిగ్భంధనం వేలాది మందితో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోరనున్నట్టు చెప్పారు.
అనాధపిల్లల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం..
రాష్ట్ర ప్రభుత్వం అనాథపిల్లల పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నదని విమర్శించారు. అనాధ పిల్లలు ప్రభుత్వ బిడ్డలని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రే గతంలో ప్రకటించారనీ, వారిని ఆదుకుంటామని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ హామీకి ఏడున్నరేండ్లయిందని చెప్పారు. ఇదే అంశంపై వేసిన మంత్రి ఉపసంఘం సిఫారసులు ఎమయ్యాయో చెప్పాలని ప్రశ్నించారు.అనాధ పిల్లలను ఆదుకోవాలంటూ మహాజన సోషలిస్టు పార్టీ (ఎంఎస్పీ) ఆధ్వర్యంలో ఈ నెల 22న సంబంధిత బ్యాధ్యులకు వినతి పత్రాలు అందజేయనున్నట్టు తెలిపారు.23న అన్ని జిల్లా కేంద్రాల్లో స్వచ్చంద సంస్థలు,ప్రజాసంఘాలు, పార్టీలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహిస్తామన్నారు. 31న ఇందిరాపార్కు వద్ద మహాదీక్ష చేపడతామని ప్రకటించారు. విలేకర్ల సమావేశంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ నరేష్ మాదిగ, అనాద వెంకటయ్య, ఎంఎస్పీ జాతీయ నాయకులు తిప్పారపు లక్ష్మణ్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.