Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీయుఎంహెచ్‌ఇయూ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వైద్యారోగ్యశాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (టీయుఎంహెచ్‌ఇయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాద నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు ఎండి.ఫసియోద్దీన్ అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యాద నాయక్ మాట్లాడుతూ... వైద్యారోగ్య రంగం ఉద్యోగులు గత మూడు సంవత్సరాలుగా తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి కరోనాను అరికట్టడంలో సమర్థవంతంగా పని చేస్తున్నారని తెలిపారు. ఆ శాఖలోని అన్ని కేడర్ల కాంట్రాక్టు ఉద్యోగులను యథాతథంగా రెగ్యులర్ చేయాలనీ, ప్రమోషన్స్ కల్పించాలనీ, ఖాళీ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలనీ, 2023 జూలై 1 నుంచి రావలసిన రెండో పీఆర్సీని వెంటనే ప్రకటించి అమలు చేయాలని కోరారు. నేషనల్ హెల్త్ మిషన్‌లోని రెండో ఏఎన్ఎంలు, ఇతర అన్ని కేడర్ల ఉద్యోగులు, డీఎస్సీ కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులు, యూరోపియన్ ఏఎన్ఎంలు, వైద్య విధాన పరిషత్ ఉద్యోగులు, 104,108, అర్బన్ హెల్త్ సెంటర్లు, ఆయూష్ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు రెగ్యులర్ ఉద్యోగులకు కూడ ప్రతి నెలా మొదటి తేదీన వేతనాలు చెల్లించాలని యాదనాయక్ డిమాండ్ చేశారు.
అనంతరం యూనియన్ నాయకులు రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ గడల శ్రీనివాసరావును కలిసి నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను శ్రీనివాసరావుకు వివరించారు. తన పరిధిలోని సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని ఆయన హామీనిచ్చారు. అనంతరం డీహెచ్ యూనియన్ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఫసియోద్దీన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాద నాయక్, రాష్ట్ర కోశాధికారి ఏ కవిత, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. హరిశంకర్, రాష్ట్ర కార్యదర్శులు వి. విజయవర్ధన్ రాజు, బైరపాక శ్రీనివాస్,ఎస్.నవీన్ కుమార్, మీనా, కె.సరోజ, కె.పుష్పలత, ఆర్. జ్యోతి, భూలక్ష్మి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.