Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ బస్సు ఎక్కడ ఉందో ట్రాకింగ్ లింక్ ద్వారా ప్రయాణీకులు తెలుసుకునే సౌకర్యాన్ని టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికుల మొబైల్ ఫోన్లకు ఈ ట్రాకింగ్ లింక్‌ను పంపుతారు. కేవలం ఒక్క క్లిక్‌తో బస్సు ఎక్కడుందో తెలుసుకునే అవకాశం దీనివల్ల కలుగుతుంది. తొలి విడతగా 1,800 రిజర్వేషన్ బస్సులకు ఈ ట్రాకింగ్ సిస్టంను అనుసంధానం చేశారు. సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణీకులకు ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు టీఎస్ఆర్టీసీ శుక్రవారంనాడొక పత్రికా ప్రకటనలో తెలిపింది. ప్రయాణీకుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ బస్‌ట్రాకింగ్ యాప్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ముందస్తు బుకింగ్ చేసుకుంటున్న ప్రయాణికుల ఫోన్లకు టికెట్ వివరాలతో పాటు బస్సు ట్రాకింగ్ లింక్‌ను సందేశరూపంలో అధికారులు పంపిస్తున్నారు. ఆ లింక్‌పై క్లిక్ చేయగానే బస్సు ఎక్కడుందో ప్రయాణికులు సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ట్రాకింగ్ యాప్ వివరాల ఆధారంగా బస్సు వచ్చే సమయాన్ని కచ్చితంగా తెలుసుకోవచ్చు. త్వరలోనే హైదరాబాద్‌లోని మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌లతో సహా మిగిలిన సర్వీస్‌లన్నింటికీ ట్రాకింగ్ సదుపాయం కల్పిస్తామని తెలిపారు. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంటుందనీ, దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చనీ తెలిపారు. దీనికోసం ప్రయాణికులు ఎలాంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. బస్సు బ్రేక్ డౌన్, వైద్య సహాయం, రోడ్డు ప్రమాదం, తదితర వివరాలను ఈ యాప్ ద్వారా ప్రయాణికులు ఆర్టీసీకి రిపోర్టు చేయొచ్చని వివరించారు.