Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శరద్ యాదవ్ మృతిపై టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ సంతాపం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి - హైదరాబాద్
ఆర్జేడీ నేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ మృతిపై తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ సంతాపం ప్రకటించారు. అపార రాజకీయ అనుభవం కలిగిన మేటి సోషలిస్టు నాయకుడిని దేశం కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పారు . వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఉన్నతస్థాయికి ఎదిగిన శరద్ యాదవ్ పేద, బడుగు వర్గాలు, రైతాంగ సమస్యలపైనే కాకుండా లౌకిక, ప్రజాతంత్ర శక్తుల బలోపేతం కోసం రాజీలేని పోరాటం చేశారని జ్ఞానేశ్వర్ కొనియాడారు. బీహార్‌తో పాటు దేశ రాజకీయాలకు చిరపరిచితుడైన ఆయన ఏడు సార్లు లోకసభకు, మూడుసార్లు రాజ్యసభకు ఎన్నికైన రాజకీయ దురందురుడు అని పేర్కొన్నారు. 80 దశకంలో ఎదురులేని కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా సోషలిస్టు భావాజాలంతో విపి సింగ్ నేతృత్వంలోని జనతాదళ్ పార్టీ ఏర్పాటులోనూ శరద్‌యాదవ్ కీలకపాత్ర పోషించారని తెలిపారు. రైతులకు వెన్నుదన్నుగా అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించిన శరద్ యాదవ్ లాంటి ఒక గొప్ప నేతను కోల్పోవడం ఆ వర్గాలకే కాకుండా దేశంలోని ప్రజాస్వామ్య శక్తులకు తీరని లోటని కాసాని జ్ఞానేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు.