Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలింతల మరణాలపై రేవంత్ ఆవేదన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మలక్‌పేట ఆస్పత్రిలో వైద్యం వికటించి మరణించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కల్వకుర్తికి సిరివెన్నెల, సైదాబాద్‌కు చెందిన శివాని వైద్యం వికటించి మరణించిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై రేవంత్ ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ లో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు కడుతున్నామంటూ గొప్పలు చెబుతున్న ప్రభుత్వం కనీసం బాలింతలను కాపాడలేకపోతున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వ వైఖరితోనే ప్రయివేటు వైద్యం ఇక్కడ అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి వైద్యమంటూ చెబుతున్న బీఆర్ఎస్ పాలనలో ఇంత ఘోరమా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైద్యంపై పూర్తిగా నమ్మకం పోతున్నదని తెలిపారు. ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ అపరేషన్‌లో ఆపరేషన్ వికటించి నలుగురు బాలింతలు మరణించారని గుర్తు చేశారు. ఆ ఘటన మరువక ముందే మలక్‌పేట ఘటన జరగడం విచారకరమని తెలిపారు. పట్టణాల్లో ఇలాంటి పరిస్థితులు ఉంటే, మారుమూల పల్లెల్లో, అటవీ ప్రాంతాల్లో పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మాటలకే పరిమితమయ్యారని చెప్పారు. ఈ సంఘటనకు ఆయనే బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరణించిన బాధిత కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కోర్టు తీర్పు పట్ల వీహెచ్ హర్షం
పంజాగుట్టలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని జీహెచ్ఎంసీ అధికారుల తొలగించడాన్ని తప్పు పడుతూ మాజీ ఎంపీ వి హనుమంతరావు కోర్టును ఆశ్రయించారు. ఆ విగ్రహాన్ని హనుమంత రావుకు అప్పగించాలంటూ కోర్టు తీర్పునివ్వడం పట్ల వీహెచ్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. న్యాయం గెలిచిందంటూ పేర్కొన్నారు.
తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు : రేవంత్
తెలుగు రాష్ట్రాల ప్రజలకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలని కోరారు. సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందపు సిరులు కురిపించాలని ఆకాంక్షించారు.
ప్రజాస్వామిక శక్తులకు పెద్ద నష్టం : కాంగ్రెస్
లోక్ తాంత్రిక్ జనతా దళ్ అధ్యక్షులు, కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ మరణం దేశంలో ప్రజాస్వామిక శక్తులకు పెద్ద నష్టమని టీపీసీసీ పేర్కొంది. ఈమేరకు శుక్రవారం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, మహేష్‌కుమార్‌గౌడ్, మల్లు రవి, చెరుకు సుధాకర్ వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలియజేశారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడు ఆయన్ను గుర్తు పెట్టుకుంటారనీ తెలిపారు.
ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.