Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో కార్మికుల సమస్యలు పరిష్కరించండి
- సీఎం కేసీఆర్‌కు సీఐటీయూ బహిరంగ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో కనీస వేతనాల జీవోలను విడుదల చేయాలనీ, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. శుక్రవారం ఈ మేరకు ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో 73 షెడ్యూల్ ఎంప్లాయిమెంట్స్‌లో కోటి మందికిపైగా కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, ఇంటి అద్దెలు, ఇతరత్రా ఖర్చులరీత్యా కనీస వేతనాల సలహా మండలి సిఫారసుల మేరకు ఐదేండ్లకోసారి వేతనాలు పెంచాలని గుర్తుచేశారు. ఎనిమిదేండ్ల నుంచి జీవోలు విడుదల చేయకపోవడం సరిగాదని పేర్కొన్నారు. 2021 జూన్‌లో విడుదల చేసిన ఐదు జీవోలను ఎందుకు గెజిట్ చేయలేదని ప్రశ్నించారు. టీఎస్ ఐపాస్ పేరిట పెట్టుబడిదారులకు రాయితీలు ఇచ్చి, తెచ్చిన కంపెనీలలో స్వరాష్ట్రంలోని నిరుద్యోగు లకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దొరకడం లేదని వాపోయారు. కాంట్రాక్టు, క్యాజువల్, తాత్కాలిక పద్దతుల్లో కార్మికులతో యాజమాన్యాలు రోజుకు 12 గంటలు పనిచేయిస్తున్న తీరును, కేవలం రూ.10 వేల నుంచి 12 వేలే జీతాలిస్తున్న వైనాన్ని వివరించారు. చాలా కంపెనీల్లో పీఎఫ్., ఈఎస్ఐ, బోనస్, సెలవులు లాంటి చట్టబద్ధ సౌకర్యాలు అమలు కావట్లేదని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. స్పెషల్ ఎకానమిక్ జోన్స్ (సెజ్‌ల) పేరిట ఏర్పాటు చేసిన పరిశ్రమలలో కార్మిక చట్టాలు అమలు చేయకుండా, యూనియన్లు పెట్టుకోకుండా అడ్డుకోవటం తగదని పేర్కొన్నారు. బీహార్, యూపీ, ఒడిశా, మధ్యప్రదేశ్, బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వస్తున్న వలస కార్మికుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని తెలిపారు. అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం అమలు చేయకుండా తుంగలో తొక్కుతున్న వైనాన్ని వివరించారు. రాష్ట్రంలో ప్రయివేటు ట్రాన్స్‌పోర్టు, భవన నిర్మాణ, హమాలీ, బీడీ రంగాల కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను లేఖలో ప్రస్తావించారు. ట్రాన్స్‌పోర్టు రంగంలోని 16 లక్షల మంది కార్మికులకు లబ్ది చేకూర్చే జీవో నెంబర్ 25ని గెజిట్ చేయాలనీ, వారికోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
భవన నిర్మాణ కార్మికుంలందర్నీ వెల్ఫేర్ బోర్డులో నమోదు చేయాలనీ, లక్ష బైకుల హామీని నెరవేర్చాలని కోరారు. రాష్ట్రంలో లోడింగ్ - అన్లోడింగ్, ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల్లో పని చేసే ఐదు లక్షల మంది హమాలీ కార్మికులకు చట్టపరమైన భద్రత సౌకర్యాలు లేవని వాపోయారు. హమాలీ కార్మికులకు కూడా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీడీ రంగంలో సుమారు 7 లక్షల మంది ఉపాధి పొందుతున్నారనీ, జీవోనెంబర్ 41 ప్రకారం వేతనాలు పెంచి మళ్ళీ దాన్ని పెండింగ్‌లో పెట్టడం తగదని పేర్కొన్నారు. బీడీ రంగంలో పనిచేస్తున్న అన్ని రకాల కార్మికుల వేతనాలు పెంచుతూ జీవోలు ఇవ్వాలనీ, బీడీ కార్మికులందరికీ జీవన భృతి కల్పించాలని కోరారు.