Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీపై పోరాడాలి
- సీఎం కేసీఆర్‌కు జూలకంటి విజ్ఞప్తి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై యుద్ధం చేయాలని కోరారు. ఈమేరకు శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, సొంత జాగా ఉంటే రూ.మూడు లక్షలు, పోడు భూములు, నిరుద్యోగ సమస్య, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, ఆర్టీసీ, మిషన్‌భగీరథ కార్మికులు, ఉద్యోగ, ఉపాధ్యాయు లకు ఇలా ఎన్నో సమస్యలను పరిష్కరిస్తా మంటూ గత ఎన్నికల్లో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇదే క్రమంలో రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కూడా అనేక హామీలిచ్చిందని పేర్కొన్నారు. విభజన హామీలను సాధించేందుకు కేంద్ర బీజేపీపై పోరాడాలని సూచించారు. ఎన్నికల సంవత్సరం వచ్చిందనీ, బడ్జెట్ సమావేశాలు కూడా రాబోతున్నాయనీ, ఈ నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. అంతేకాకుండా రాష్ట్రానికి బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని ఎండగడుతూనే... ఆ పార్టీ తెలంగాణలో బలపడకుండా అడ్డుకోవాలని సూచించారు. బీజేపీని నిలువరించేందుకు వామపక్ష, ప్రజాతంత్ర, ప్రజాస్వామిక శక్తులతో కలిసి మతోన్మాద శక్తులపై పోరాడాలని పిలుపునిచ్చారు.