Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూలూరు గౌరీశంకర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దళితులలో అత్యంత వెనుకబడిన 57 ఉపకులాల సాహిత్య సాంస్కృతిక జీవన విధానాల చరిత్రను సాహిత్య అకాడమి ద్వారా గ్రంథస్థం చేసేందుకు కృషి చేస్తామని తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మెన్ జూలూరు గౌరీశంకర్ తెలిపారు. తరతరాలుగా అట్టడుగున పడున్న వర్గాల వారి సాహిత్య సాంస్కృతిక చరిత్రలను వెలికితీసి రేపటి తరానికి అందించటమే సాహిత్య అకాడమి ముందున్న ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు భైరి వెంకటేశం మోచి శుక్రవారం సాహిత్య అకాడమీ కార్యాలయంలో తమ ఉపకులాలకు, జాతులకు సంబంధించిన సాహిత్య సాంస్కృతిక చరిత్రలని గ్రంథస్థం చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జూలూరు మాట్లాడుతూ ఉపకులాలలో ముఖ్యంగా యక్షగానం, భాగవతాన్ని ప్రదర్శించే చిందోల్లు హౌలియదాసరులు, జాంబపురాణాన్ని ప్రదర్శించే డక్కలి కులస్తులు, గ్రామ దేవతలను కొలిచే బైండ్ల, దేవతి, పోతరాజులు, శివారాధన చేసే మాలజంగాలు, మాదిగ జంగాలు (నులక చందయ్యలు), వైష్ణవారాధకులైన మిత అయ్యల్వార్లు, చెప్పులవృత్తిపై ఆధారపడి జీవించే మోచి, సమగర కులస్తులు, సాహస క్రీడలు ప్రదర్శించే మాస్టీన్, దొంబర కులస్తులు, ఇంకా మాదాసి కురువ, మాంగ్, బుడగజంగాలు, గోసంగిలు, పైడి, పాకి తదితర కులాలకు చెందిన మౌకిక సాహిత్యాన్ని నమోదు చేయాల్సిన అవసరమెంతో ఉందన్నారు. ఉపకులాలకు సంబంధించిన ఘనమైన చరిత్రలు ఇప్పటిదాకా వెలుగులోకి రాలేదనీ, వాటిని వెలుగులోకి తేవాల్సిన బాధ్యత సాహిత్య అకాడమి చేపడుతుందని తెలిపారు. ఇప్పటికే ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆయా కులాల చరిత్రలను భద్రపరచాలనీ, వాటిని గ్రంథస్థం చేయాలని కోరడాన్ని సాహిత్య అకాడమి ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. అన్ని వర్గాల, అన్ని కులాల సకల జనుల సాహిత్య సాంస్కృతిక చరిత్రను గ్రంథస్థం చేసినప్పుడే సమగ్ర తెలుగు సాహిత్యమవుతుందని పేర్కొన్నారు. ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట అధ్యక్షులు బైరి వెంకటేశంతో పాటుగా మాంగ్ సమాజ్, రాష్ట్ర అధ్యక్షులు జి. తులసిదాస్, సీనియర్ జర్నలిస్టు బుద్ధం నరసింహస్వామి ఈ కార్యక్రమంలో ఉన్నారు.